
బెంగళూరు: ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 9లో జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 15 పాయింట్ల తేడాతో గెలుపొందింది. జైపూర్ 39-24తో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ చివరి వరకు అదే జోరును కొనసాగించింది. ఫస్టాఫ్ ముగిసే సరికి 20-12తో లీడ్‌లో నిలిచింది. ఫస్టాఫ్‌లో 11 రైడింగ్ పాయింట్స్ సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ 6 ట్యాకిల్ పాయింట్స్‌తో పాటు రెండు ఆలౌట్స్ పాయింట్లు సాధించింది.
సెకాండాఫ్‌లో కూడా ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని జై పూర్ పింక్ పాంథర్స్ రైడర్స్ 9 రైడింగ్ పాయింట్స్ సాధించారు. డిఫెండర్లు సైతం 7 ట్యాకిల్ పాయింట్స్ సాధించడంతో జైపూర్‌కు 2 ఆలౌట్ పాయింట్స్ లభించాయి. అర్జున్ దేశ్‌వాల్ 10 రైడింగ్ పాయింట్లు, అంకుష్ 5 ట్యాకిల్ పాయింట్స్‌తో జైపూర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ వారియర్స్ శ్రీకాంత్ జాదవ్ 6 రైడింగ్ పాయింట్లతో రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. ఈ విజయంతో జైపూర్ పింక్ పాంథర్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన జైపూర్.. 38 పాయింట్ల తేడాతో దూసుకెళ్తోంది.
ఐదింటికి ఐదు గెలిచిన దబాంగ్ ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. బెంగాల్ వారియర్స్, యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్ వరుసగా టాప్-5లో ఉన్నాయి. ఒకే ఒక విజయం సాధించిన తెలుగు టైటాన్స్ 11వ స్థానంలో ఉంది.