పారిస్ ఒలింపిక్స్ 2024కు రంగం సిద్దమైంది. మరో 9 రోజుల్లో ఈ క్రీడల మహాసంగ్రామానికి తెరలేవనుంది. ఈసారి భారత బాక్సర్లు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో కంచుతో మెరిసిన లవ్లీనాతో పాటు తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్.. జైస్మిన్ లాంబోరియా, ప్రీతి పన్వర్, అమిత్ ఫంగాల్ ఆశలు రేకెత్తిస్తున్నారు.
2008లో బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం దక్కింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్‌సింగ్ కాంస్యంతో ఖాతా తెరవగా.. 2012లో మేరీకోమ్, టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ సారి కంచుకు మించిన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా భారత బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 50 కేజీల విభాగంలో ఆమె హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు.

మేరీకోమ్‌తో పోటీపడి..
భారత బాక్సింగ్‌లో నిఖత్ ప్రయాణమే ఓ సంచలనం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్.. టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఆమెకు పోటీగా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఉండటంతో నిఖత్‌ను దురదృష్టం వెంటాడింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన మేరీ కోమ్‌ను నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేయాలని భారత బాక్సింగ్ సంఘం నిర్ణయించింది. కానీ నిఖత్ జరీన్ ట్రయల్స్ పెట్టాలని పోరాడింది.
ఈ ట్రయల్స్‌లో నిఖత్‌పై మేరీ కోమ్ విజయం సాధించి టోక్యోకు అర్హత సాధించింది. ఈ ఓటమి నిఖత్‌కు నిరాశ కలిగించినా ఆమె పట్టుదల వదల్లేదు. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచి ఔరా అనిపించింది. కామన్వెల్త్‌లో బంగారు పతకంతో పాటు ఆసియా క్రీడల్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధిస్తుందని అంతా భావిస్తున్నారు.
లవ్లీనా..
ఎలాంటి అంచనాలు లేకుండా సంచల ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గొహెయిన్(75 కేజీలు).. ఇప్పుడు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అసోంకు చెందిన అమ్మాయి ఈ సారి కంచుకు మించి ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. టోక్యో విజయం తర్వాత లవ్లీనా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. టోక్యోలో 69 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె ఈసారి 75 కేజీల విభాగానికి మారింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి జోరు మీద ఉంది. పారిస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృత్తం చేయాలనే పట్టుదలతో ఉంది.
జైస్వీన్ లాంబోరియా(57 కేజీలు), ప్రీతి పన్వర్(54 కేజీలు) విభాగంలో పోటీపడుతున్నారు. వీరిపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. తీసిపారేసే బాక్సర్లు కాదు. పురుషుల విభాగంలో అమిత్ పంగాల్, నిశాంత్ దేవ్‌లు మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పోటీ పడుతుండగా.. 71 కేజీల విభాగంలో నిశాంత్ దేవ్ బరిలోకి దిగుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో విఫలమైన అమిత్ పంగాల్ ఈసారి పోడియం ఎక్కాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు నిశాంత్ దేవ్‌పై పెద్దగా అంచనాలు లేవు.