భారత మహిళా బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బోర్గహైన్ మరోసారి సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ చేరి మెడల్‌కు అడుగు దూరంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా విజయం సాధిస్తే బ్రాంజ్ మెడల్ ఖాయం అవుతోంది. బాక్సింగ్‌లో సెమీఫైనల్ చేరిన ఇద్దరు అథ్లెట్లకు బ్రాంజ్ మెడల్స్ ఇస్తారనే విషయం తెలిసిందే.
మిగతా ఈవెంట్లలా బాక్సింగ్‌లో కాంస్య పోరు నిర్వహించరు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో లవ్లీనా బోర్గహైన్ 5-0తో నార్వే బాక్సర్ సున్నివా హోఫ్‌స్టాడ్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం పూర్తి ఆధిపత్యం చెలాయించిన లవ్లీనా.. తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ముఖ్యంగా తన డిఫెన్సివ్ టెక్నిక్‌తో జడ్జీలను ఆకట్టుకుంది.

టోక్యో ఒలింపిక్స్ 2020లో 69 కేజీల విభాగంలో తలపడిన లవ్లీనా బ్రాంజ్ మెడల్‌తో సత్తా చాటింది. ఈ సారి 75 కేజీల విభాగంలో 8వ సీడ్‌గా బరిలోకి దిగిన లవ్లీనా రెండో పతకంపై గురి పెట్టింది. ఆదివారం(ఆగస్ట్ 4) జరిగే క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా బోర్గహైన్.. చైనా టాప్ సీడ్ బాక్సర్, టోక్యో సిల్వర్ మెడలిస్ట్ లి కియాన్‌తో తలపడనుంది. లవ్లీనా కంటే లి కియాన్‌కు మెరుగైన రికార్డ్ ఉంది. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి బాక్సర్‌గా లవ్లీనా చరిత్రకెక్కుతుంది.
చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి..
మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో భారత ప్లేయర్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ రౌండ్ 16లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్ 32 మ్యాచ్‌లో శ్రీజ 4-2 తేడాతో సింగపూర్ ప్లేయర్ జియాన్‌ను ఓడించింది. మొత్తం 6 సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో శ్రీజ విజయం సాధించింది.
తొలి సెట్‌ను తృటిలో చేజార్చుకున్న శ్రీజ.. రెండో సెట్‌లో పోరాడి గెలిచింది. మూడు, నాలుగు సెట్లలో మాత్రం శ్రీజ అవోకగా విజయం సాధించింది. ఐదో సెట్‌లో సింగపూర్ ప్లేయర్ విజయం సాధించగా.. చివరి సెట్‌లో శ్రీజ గెలుపొందింది. ఈ గెలుపుతో ఒలింపిక్స్ రౌండ్ 16లోకి ప్రవేశించిన రెండో భారత క్రీడాకారిణిగా శ్రీజ రికార్డ్ సాధించింది. ఇప్పటికే మనికా బాత్రా రౌండ్ 16కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.