
న్యూఢిల్లీ: మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడం అద్భుతమైన అనుభూతినిస్తోందని భారత స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) తెలిపింది. ఒలింపిక్స్ పసిడి పతకాన్ని అందుకోవడమే తన తదుపరి లక్ష్యమని, ఆ దిశగా సాగుతానని చెప్పింది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన 50 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 5-0తో థీ థామ్ న్యూయెన్ (వియత్నాం)ను చిత్తుచేసింది. గతేడాది 52 కేజీల విభాగంలో పోటీపడిన నిఖత్ జరీన్.. ఒలింపిక్స్ నేపథ్యంలో 50 కేజీల కేటగిరికి మారింది. ఈ విజయానంతం ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది. సొంతగడ్డపై ఛాంపియన్‌గా నిలవడం కొత్త అనుభూతినిస్తోందని, ఈ పతకాన్ని దేశానికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొంది.
'రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని వివరించడానికి మాటలు రావడం లేదు. వరుసగా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ కావడం అద్భుతమైన అనుభూతినిస్తోంది. స్వదేశంలో జరిగిన ఈ పోటీల్లో మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ బంగారు పతకాన్ని దేశానికి అంకితం ఇస్తున్నా. ఆటపై ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. దేశం కోసం పతకాలు సాధించాలనే పట్టుదల, రింగ్‌లో దిగితే వంద శాతం పోరాడాలనే అంకిత భావంతో ముందుకు సాగుతున్నా. ప్రత్యర్థి ఎవరైనా గెలవాలనే ధైర్యం ప్రదర్శిస్తా. 'ఒలింపిక్స్ ఆడాలి. అందులో స్వర్ణం గెలవాలి.'ఇదే నిత్యం నన్ను ప్రేరేపిస్తోంది.
ఇప్పటివరకూ నా కెరీర్‌లో అత్యంత కఠినమైన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఇదే. బరువు విభాగం మారడంతో సీడింగ్ దక్కలేదు. దీంతో ఆరు బౌట్లలో పోటీ పడాల్సి వచ్చింది. పైగా ప్రతీ ప్రత్యర్థి నుంచి గట్టి సవాలు ఎదురైంది. రెండో రౌండ్లో టాప్‌సీడ్, ఆఫ్రికా ఛాంపియన్ రొమేసా, సెమీస్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య విజేత వాలెన్సియాతో తలపడి గెలిచా. హెరెరాతో ప్రిక్వార్టర్స్‌లో పెదవి గాయమైనా పైచేయి సాధించా. అప్పటికే మూడు బౌట్లు ఆడడంతో క్వార్టర్స్‌లో రక్సాత్‌తో పోరులో అలసిపోయినట్లు అనిపించింది. కానీ తిరిగి పుంజుకుని 5-2తో నెగ్గా. ఇక ఫైనల్ సమరం కూడా హోరాహోరీగానే సాగింది.
సొంత అభిమానుల మధ్య విజయం సాధించడం గొప్పగా ఉంది. తల్లిదండ్రుల ముందు టైటిల్ నెగ్గడం ఎప్పటికీ మరిచిపోను. పారిస్ ఒలింపిక్స్ దృష్టిలో పెట్టుకుని బరువు విభాగం మారాలనుకున్నా. 54తో పోలిస్తే 50 కేజీలకు మారడమే సులువనిపించింది. బరువు పెరగడం కంటే తగ్గాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం కష్టపడ్డా. ఆహార నియమాలు పాటించా. ఒలింపిక్స్‌కు ముందు ఈ విభాగంలో మన ప్రదర్శన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే నిరుడు కామన్వెల్త్ క్రీడల్లో 50 కేజీల విభాగంలో తలపడ్డా. అప్పుడు పసిడి నెగ్గా. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్ గెలిచా.'అని నిఖత్ జరీన్ చెప్పుకొచ్చింది.