అల్లు అర్జున్, రామ్ చరణ్‌లకు నేను బిగ్ ఫ్యాన్: నిఖత్ జరీన్

హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్‌లకు తాను వీరాభిమానినని వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ తెలిపింది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ హీరోల సినిమాలే ఎక్కువగా చూస్తానని చెప్పింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి ఈ తెలంగాణ ముద్దు బిడ్డ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కామన్‌వెల్త్ గేమ్స్, పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న నిఖత్ జరీన్.. తాజాగా ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి ప్రపోజల్స్‌తో పాటు మేరీకోమ్‌తో వివాదం, బయోపిక్‌కు సంబంధించిన అంశాలపై మాట్లాడింది.

బయోపిక్ ఇప్పుడే వద్దన్నా..
'ప్రాక్టీస్ లేదా గేమ్‌కు సంబంధించి మానసికంగా, శారీరకంగా బాగా ఆలసిపోయి ఒత్తిడికి లోనయినప్పుడు ముందుగా వాటి గురించి ఆలోచించడం మానేస్తాను. ఆ విషయాలన్నిటినీ అస్సలు పట్టిచ్చుకోను. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వంట చేస్తా. విశ్రాంతి తీసుకుంటాను. లేదంటే సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు చూస్తా. ఈ ముగ్గురికి నేను బిగ్ ఫ్యాన్‌ని. వీళ్లని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటా. వరల్డ్ చాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో గెలిచాక 'తగ్గేదేలే' అంటూ అల్లు అర్జున్ మేనరిజమ్‌ను ట్రై చేశాను.
ఇక తన జీవిత ప్రయాణంపై బయోపిక్ తీస్తామని చాలా మంది సంప్రదించారు. అయితే, ఒలింపిక్స్ మెడల్ సాధించేవరకు బయోపిక్ అంశాన్ని ముట్టుకోదలుచుకోలేదు. మీ ఆశీస్సులతో కచ్చితంగా వచ్చే ఒలింపిక్స్‌లో కూడా పతకం సాధిస్తా.

మేరీకోమ్ నా ఆరాధ్య దైవం..
మేరీకోమ్ లెజెండ్. నాకు ఆరాధ్య దైవం. టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్ నిర్వహించి విజేతను ఎంపిక చేయాలని మాత్రమే నేను అప్పుడు ఫెడరేషన్‌ను కోరాను. అయితే, దీన్ని కేవలం ట్రయల్స్ పరంగా చూడకుండా... మేరీకోమ్ సామర్థ్యాన్ని నేను సవాల్ చేస్తున్నట్టు కొందరు వివాదంగా మార్చారు. దానివల్ల మా మధ్య అప్పట్లో కొంత గ్యాప్ వచ్చింది కానీ, ఇప్పుడైతే అదేమీ లేదు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ గెలిచాక.. నన్ను అభినందిస్తూ మేరీ ట్వీట్ చేశారు.

ఎవ్వరూ మాట్లాడ లేదు..
టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్ సమయంలో మేరీకోమ్‌తో బౌట్ సందర్భంగా చెలరేగిన వివాదం తర్వాత సహచర బాక్సర్లు కొందరు మాట్లాడటం మానేశారు. ముఖ్యంగా భారత క్యాంప్‌లో ఉన్నప్పుడు నాతో దూరం దూరంగా ఉంటూ ముభావంగా మెలిగేవారు. అయితే, ఆ విషయాలేవీ నేను పట్టించుకోలేదు. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ చేజారిన తర్వాత 'నా టైమ్ ఎప్పుడొస్తుందా?' అని మాత్రం ఎదురు చూశాను. నిరుత్సాహానికి లోనవకుండా ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాను. మానసికంగా మరింత దృఢంగా తయారయ్యాను. పంచ్ ల్యాండింగ్ టెక్నిక్స్ మీద దృష్టి పెట్టాను.. కండ బలం కంటే బుద్ధి బలం ఎక్కువ వాడితేనే బాక్సింగ్‌లో రాణిస్తామని అర్థం చేసుకున్నాను.

పెళ్లి ఆలోచనలు లేవు..
ప్రస్తుతానికైతే పెళ్లి ఆలోచనలు లేవు. నా దృష్టంతా కెరీర్‌పైనే. అయితే, వరల్డ్ చాంపియన్ అయ్యాక పెళ్లి ప్రపోజల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో, ఇ-మెయిల్స్‌లో వస్తున్న కొన్ని చిత్ర విచిత్రమైన ప్రపోజల్స్, కవితలు చూసి పడిపడి నవ్వుకుంటున్నా.'అని నిఖత్ జరీన్ చెప్పుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications