Nikhat Zareen: ఫైనల్లో తెలంగాణ అమ్మాయి.. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌ను ఓడించి..

న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ చూపెట్టింది. స్ట్రాంజా మొమోరియల్ బాక్సింగ్ టోర్నీలో ఇప్పటికే పతకం ఖాయం చేసిన ఈ 25 ఏళ్ల అమ్మాయి.. దాన్ని పసిడిగా మార్చే దిశగా సాగుతోంది. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం సెమీస్‌లో నిఖత్ 4-1 తేడాతో బుసె నాజ్ కకియోగ్లు (టర్కీ)పై విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ప్రత్యర్థిపై ఈ పోరులో నిఖత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తనదైన పంచ్‌లతో విరుచుకుపడింది. ప్రత్యర్థికి ఊహకు అందని రీతిలో ఎదురుదాడికి దిగింది.

నీతూ కూడా..
ఇక 48 కేజీల విభాగంలో నీతు కూడా ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒఖోతాను ఆమె చిత్తుచిత్తుగా ఓడించింది. నీతు ధాటికి తాళలేని ప్రత్యర్థి రెండో రౌండ్లోనే కుప్పకూలిపోయింది. మరోవైపు యూత్ ప్రపంచ ఛాంపియన్ అరుంధతి చౌదరీ (70 కేజీలు), పర్వీన్ (63 కేజీలు)కు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో అరుంధతి 1-4తో ఒలింపిక్ ఛాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలి (టర్కీ) చేతిలో ఓడింది. పర్వీన్ 2-3తో నటాలియా (రష్యా) చేతిలో పోరాడి పరాజయం పాలైంది.

కామన్వెల్త్కు చాను
ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి తొలి రజత పతకం అందించి చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను.. ఇప్పుడు కొత్త విభాగంలో కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. టోక్యోలో 49 కేజీల విభాగంలో ఆమె వెండి పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 55 కేజీల విభాగంలో బరిలో దిగిన తొలి పోటీల్లోనే ఆమె సత్తాచాటింది. సింగపూర్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీలో స్వర్ణం సాధించి.. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడల బెర్తు ఖరారు చేసుకుంది. ఆమె మొత్తం 191 కేజీల (స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జర్క్‌లో 105) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. జెస్సికా (ఆస్ట్రేలియా- 167 కేజీలు), కసాండ్రా (మలేసియా- 165 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మరోవైపు కామన్వెల్త్ ర్యాంకింగ్స్ ఆధారంగా 49 కేజీల విభాగంలోనూ 27 ఏళ్ల చాను ఈ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది.

భారత జోడీకి సిల్వర్..
ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత జోడీ శ్యామ్ సుందర్ స్వామి-జ్యోతి బలియాన్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. మిక్స్‌డ్ పెయిర్ విభాగం ఫైనల్లో శ్యామ్-జ్యోతి 148-150తో బెయిర్ షిగయెవ్-తతియానా (రష్యా) చేతిలో పోరాడి ఓడారు. ఈ పోరులో ఫస్టాఫ్ ముగిసే సరికి 78-76తో ఆధిక్యంలో నిలిచిన భారత జోడీ.. సెకండాఫ్‌లో తడబడి స్వర్ణాన్ని చేజార్చుకుంది. అంతకుముందు సెమీస్‌లో శ్యామ్-జ్యోతి 151-145తో జూలీ-థియరీ (ఫ్రాన్స్)పై గెలిచారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications