

హైదరాబాద్: ప్రతిష్టాత్మక మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్, మన ఇందూర్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. గురువారం 52కేజీ ఫ్లయ్‌వెయిట్ విభాగంలో జరిగిన ఫైనల్లో తను 5-0 తేడాతో జిట్‌పాంగ్ జుటామస్ (థాయ్‌లాండ్)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఐదో భారత బాక్సర్‌గా నిఖత్ నిలిచింది. గతంలో మేరీ కోమ్, సరితాదేవి, ఆర్‌ఎల్ జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్ సాధించారు. అయితే చివరిసారిగా 2018లో మేరీకోమ్ (48కేజీ) భారత్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించగా.. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ బాక్సర్ దేశానికి స్వర్ణం అందించడం విశేషం. నిఖత్ సాధించిన ఈ విజయం పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తుంది.
దేశ ప్రధాని నుంచి గల్లీ లీడర్ వరకు నిఖత్ సాధించిన విజయాన్ని అభినందిస్తున్నారు. రాజకీయ నాయకులే కాదు ఇతర క్రీడా ప్రముఖులు, సినీతారలు, అభిమానులు నిఖత్ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత బాక్సింగ్ దిగ్గజం, మణిపూర్ మణిపూస మేరీ కోమ్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. కనీసం నిఖత్ విజయాన్ని అభినందిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. తన రంగానికే చెందిన ఓ యువ బాక్సర్ పట్ల మేరీ కోమ్ ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మేరీ కోమ్ తీరును ప్రతీ ఒక్కరు తప్పుబడుతున్నారు. ఏ క్రీడలోనైనా సీనియర్ ఆటగాళ్లు యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తారని కానీ బాక్సింగ్‌లో మాత్రం భిన్న సంస్కృతి కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇద్దరి మధ్య గొడవలు జరగొచ్చని, కనీసం క్రీడా స్పూర్తి లేకుంటే ఎలా? అని మండిపడుతున్నారు.
గతంలో నిఖత్ జరీన్‌ను ఘోరంగా అవమానించిందని, ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని అభినందిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఒలింపిక్స్ వెయిట్ కేటగిరీలను మార్చడంతో అప్పటివరకు 48 కిలోల విభాగంలో పోటీ పడిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్.. నిఖత్ ఆడే 52 కిలోల కేటగిరీకి మారింది. ఎలాంటి ట్రయల్స్ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేసినట్టు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) ప్రకటించడంతో అప్పటివరకు గమ్మునున్న నిఖత్ తొలిసారిగా గొంతెత్తింది. ట్రయల్ నిర్వహించాలంటూ పట్టుబట్టింది. భారత మాజీ క్రికెటర్ గంభీర్ సహా పలువురు ప్రముఖులు, మీడియా నిఖత్‌కు మద్దతుగా నిలవడంతో చేసేదేమీ లేక బీఎఫ్‌ఐ ట్రయల్స్ నిర్వహించింది.
ఇందులో నిఖత్ మెరుగైన ప్రదర్శన కనబర్చినా, ఫలితం మేరీకోమ్‌కు అనుకూలంగా వచ్చిందని అప్పట్లో పెద్ద ఎత్తున విశ్లేషకుల నుంచి విమర్శలు చెలరేగాయి. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది.