Nikhat Zareen:ఇందూరు బిడ్డ.. బంగారు కొండ.. మేరీకోమ్ ఎగతాళికి గట్టి సమాధానం!

ఇస్తాంబుల్: తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ అనుకున్నది సాధించింది. మహిళల ప్రపంచకప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గి తన కల నేరవేర్చుకుంది. గురువారం జరిగిన 52 కేజీ ఫైనల్ బౌట్‌లో 5-0తో థాయ్‌లాండ్ బాక్సర్ జిట్ పాంగ్ జుటామస్‌ను ఓడించి వరల్డ్ చాంపియన్ అయ్యింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో మెడల్.
ఇక బాక్సింగ్ రింగ్ కూడా లేని నిజామాబాద్ పట్ణణం నుంచి భారత స్టార్ బాక్సర్‌గా నిఖత్ జరీన్ ఎదిగిన తీరు ప్రశంసనీయం. పదేళ్ల వయసులో వేసవి సెలవుల్లో తండ్రితో కలిసి సరదాగా ఫిట్‌నెస్ కోసం మైదానం బాట పట్టిన నిఖత్ తొలుత అథ్లెటిక్స్‌లో ప్రవేశించి ఆ తర్వాత బాక్సింగ్‌ను కెరీర్‌గా మలుచుకుంది.

తండ్రి ప్రోత్సాహంతో..
ఆమె కెరీర్ ఈ స్థాయికి చేరడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి జమీల్ అహ్మద్ పట్టుదల, సహకారం. నలుగురు అమ్మాయిలలో మూడోదైన నిఖత్‌ను ఆయన తన ఇష్టప్రకారం క్రీడల్లో ప్రోత్సహించాడు. నిజామాబాద్‌లో ప్రముఖ బాక్సింగ్ కోచ్‌గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు.
నిజామాబాద్‌లో సాధన చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో నిఖత్ కోసం కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు మకాం మార్చింది. కోచ్ చిరంజీవి వద్ద రింగ్‌లో రాటు దేలిన నిఖత్ 2011లో వరల్డ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవగానే తన జీవిత లక్ష్యమేంటో స్పష్టంగా చెప్పింది.

గాయంతో దూరమైనా...
2014లో యూత్ చాంపియన్‌గా అవతరించాక నిఖత్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. తర్వాతి ఏడాదే 52 కిలోల విభాగంలో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 2016లో భుజానికైన గాయంతో దాదాపు ఆరు నెలలు రింగ్‌కు దూరమైంది. గాయం నుంచి కోలుకున్నాక కూడా నిఖత్ తిరిగి ఫామ్‌ను దొరకబుచ్చుకోవడానికి చాలా శ్రమించింది.
జెఎస్‌డబ్ల్యూ ఆర్థిక సాయంతో బళ్లారిలోని శిక్షణ కేంద్రంలో విదేశీ కోచ్ జాన్ వద్ద ట్రైనింగ్ ఆరంభించాక నిఖత్ మునుపటి కంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారైంది. ఇదే జోరులో యూత్ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్ కప్, థాయిలాండ్ ఓపెన్‌లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్ తారగా గుర్తింపు దక్కింది.

మేరికోమ్‌తో కిరికిరీ
నిఖత్ జరీన్‌కు లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ స్పూర్తి. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆటలో తనదైన ముద్ర వేయడం ప్రారంభించింది. కెరీర్ ఆరంభంలోనే నిఖత్‌కు జూనియర్ మేరీకోమ్ అనే పేరొచ్చింది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో తన ఆరాధ్య బాక్సర్ మేరీకోమ్ రూపంలో నిఖత్‌కు అసలైన సవాల్ ఎదురైంది.
ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఒలింపిక్స్ వెయిట్ కేటగిరీలను మార్చడంతో అప్పటివరకు 48 కిలోల విభాగంలో పోటీ పడిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్.. నిఖత్ ఆడే 52 కిలోల కేటగిరీకి మారింది. అప్పటి కేంద్ర క్రీడా మంత్రి, మేరీకోమ్ ఈశాన్య రాష్ట్రానికి చెందిన వారే కావడంతో జాతీయ బాక్సింగ్ సమాఖ్యలో మేరీకోమ్‌కు అడ్డు చెప్పే సాహసం కూడా ఎవరు చేయలేకపోయారు.

నిఖత్ ఎవరంటూ..
ఎలాంటి ట్రయల్స్ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేసినట్టు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) ప్రకటించడంతో అప్పటివరకు గమ్మునున్న నిఖత్ తొలిసారిగా గొంతెత్తింది. ట్రయల్ నిర్వహించాలంటూ పట్టుబట్టింది. భారత మాజీ క్రికెటర్ గంభీర్ సహా పలువురు ప్రముఖులు, మీడియా నిఖత్‌కు మద్దతుగా నిలవడంతో చేసేదేమీ లేక బీఎఫ్‌ఐ ట్రయల్స్ నిర్వహించింది.
ఇందులో నిఖత్ మెరుగైన ప్రదర్శన కనబర్చినా, ఫలితం మేరీకోమ్‌కు అనుకూలంగా వచ్చిందని అప్పట్లో పెద్ద ఎత్తున విశ్లేషకుల నుంచి విమర్శలు చెలరేగాయి. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. దిగ్గజ బాక్సర్‌తో తలపడేందుకు ప్రయత్నించిందంటూ నిఖత్‌పై ప్రతికూల విమర్శలు వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications