
న్యూఢిల్లీ: లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్న తోటి ఆటగాడికి అండగా నిలిచేందుకు భారత బాక్సర్లు ముందుకొచ్చారు. చేతనైనంత ఆర్థిక సాయం చేసి అతనికి అండగా నిలబడ్డారు. స్టార్ బాక్సర్లు విజేందర్ సింగ్, మనోజ్ కుమార్ చొరవతో ఈ కార్యక్రమం మొదలైంది.
ఏషియా గేమ్స్ మాజీ గోల్డ్ మెడలిస్ట్ డింకోసింగ్ (41) కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.'హమ్ మే హై దమ్' పేరుతో పలువురు బాక్సర్లు, కోచ్‌లు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో మనోజ్ కుమార్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. మంగళవారం సాయంత్రం డింకోసింగ్ బ్యాంక్ ఖాతా వివరాలు లభించిన తర్వాత తొలుత విజేందర్ తన వంతుగా రూ.25 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన వారు తమ స్థాయి మేరకు డబ్బు పంపారు. ఇలా ఇప్పటి దాకా లక్ష రూపాయలకు పైగా డింకోసింగ్ అకౌంట్‌లో జమచేశారు. ఈ డిపాజిట్లు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ విషయంపై విజేందర్ పీటీఐతో మాట్లాడుతూ.. 'మాకు 'హమ్ మే హై దమ్' పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. డింకో నిస్సహాయ స్థితి గురించి అందులో మనోజ్ పోస్ట్ చేశాడు. మేం వెంటనే అతని బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని తోచిన సాయం చేశాం. లక్ష వరకు అందజేశాం. ఈ డిపాజిట్లు ఇంకా కొనసాగుతున్నాయి. నా వంతుగా రూ. 25వేలు సాయం చేశా. మిగతా వారు వారికి తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కొందరు రూ.5వేలు, మరికొందరు 11వేలు అందజేశారు'అని ఈ ఒలింపియన్ మెడలిస్ట్ తెలిపాడు.
అయితే లాక్‌డౌన్ వల్ల డింకో సింగ్ ఇపాల్‌లోని తన ఇంట్లోనే ఉండటంతో సరైన చికిత్స తీసుకోలేక పోతున్నాడు. దీంతో చొరవ తీసుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. ఈ నెల 25న అతన్ని ఢిల్లీకి తరలించి రేడియేషన్ థెరపీ ఇప్పించనుంది.