Asian Boxing Championship 2021: సంజీత్‌కు స్వర్ణం.. అమిత్, థాపాకు సిల్వర్!

దుబాయ్: భారత స్టార్ బాక్సర్, వరల్డ్ నంబర్‌వన్ అమిత్ పంగల్‌కు షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన అతను గోల్డ్ మెడల్ నిలబెట్టుకోలేకపోయాడు. మరో పేరున్న బాక్సర్ శివ ధాపా కూడా హోరాహోరీగా పోరాడినా సిల్వర్‌తోనే వెనుదిరిగాడు. పురుషుల కేటగిరీలో గోల్డ్ లేకుండానే భారత్ పోరాటం ముగుస్తుందని భావిస్తుండగా.. సంజీత్ మాయ చేశాడు. పెద్దగా అంచనాలే లేకుండా బరిలోకి దిగిన అతను ఒలింపిక్ మెడలిస్ట్ వెసిలీ లెవిట్‌కు షాకిస్తూ గోల్డెన్ పంచ్ కొట్టి టోర్నీలో ఇండియాకు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు.

సంజీత్‌కు స్వర్ణం..
పోటీల ఆఖరి రోజు భారత్ నుంచి చివరగా బరిలోకి దిగిన సంజీత్.. 91 కిలోల విభాగంలో పసిడి పతకం గెలుచుకున్నాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్లో అతడు 4-1తో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత కజకిస్థాన్‌కు చెందిన వాసిలీ లెవిట్‌పై విజయం సాధించాడు. తొలి రెండు రౌండ్లలో ప్రత్యర్థిపై విరుచుకుపడిన సంజీత్.. ఆఖరి వరకు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
మరో రెండు ఫైనల్స్‌లో గట్టిగానే పోరాడినప్పటికీ.. అమిత్ పంగల్, శివ థాపా మాత్రం రజత పతకాలతో సరిపట్టుకున్నారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అమిత్ పంగల్ (52కేజీ) 2-3తో షఖోబిదిన్ జొయిరోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు.

పాపం అమిత్..
2019 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా ఇదే ప్రత్యర్థి చేతిలో, ఇంతే తేడాతో అమిత్ ఓడాడు. ఇప్పుడు కూడా ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. తొలి రౌండ్ నుంచే వేగంగా పంచ్‌లు విసురుకున్నారు. తొలి రౌండ్‌ను జొయిరోవ్ చేజిక్కించుకోగా.. బలంగా పుంజుకున్న అమిత్ రెండో రౌండ్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మూడో రౌండ్లో కూడా అమిత్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. ప్రత్యర్థి స్కోరును దాటడానికి అది సరిపోలేదు. అయితే మొత్తంగా అమితే బాగా ఆడాడని భావించిన భారత్.. ఫలితంపై సమీక్ష కోరినా ఉపయోగం లేకపోయింది. ఫలితాన్ని మార్చడానికి జ్యూరీ తిరస్కరించింది.

మొత్తం 15 మెడల్స్..
ఈ సమీక్ష పద్ధతిని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) 2019లో ప్రవేశపెట్టింది. బౌట్ ముగిసిన 15 నిమిషాల్లో ఆటగాడి జట్టు మేనేజర్ లేదా ప్రధాన కోచ్ ఫలితంపై ఫిర్యాదు చేయాల్సివుంటుంది. 5-0 లేదా 4-1 ఫలితాన్ని సమీక్షకు పరిగణనలోకి తీసుకోరు. ఇదే టోర్నీ మహిళల సెమీస్‌లో ప్రత్యర్థి దినా జొలమాన్ ఫలితంపై సమీక్ష కోరడంతో భారత బాక్సర్ సాక్షి చౌదరి (54కేజీ) ఫైనల్లో స్థానాన్ని కోల్పోయింది. సోమవారం మరో ఫైనల్లో శివ థాపా (64కేజీ) కూడా 2-3 స్కోరుతో చింజోరిగ్ (మంగోలియా) చేతిలో కంగుతిన్నాడు. ఈ ఆసియా ఛాపియన్‌షిప్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో రెండు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుచుకుంది. 2019లో సాధించిన 13 పతకాల రికార్డును అధిగమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications