
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగుపెట్టింది. మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రతినిధులు, విమానాశ్రయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఆమె రజతం కైవసం చేసుకుంది.
ఇక మెడల్ సాధించిన సింధు, ఆమె కోచ్‌ను బాయ్ సెక్రటరీ అజయ్ సింఘానియా తమ అధికారులతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసిన సింధు 'నేను సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహా నన్ను ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.'అని తెలిపింది.
అనంతరం సింధుతో పాటు ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ పార్క్ తై సేంగ్‌ను భారత ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, కిషన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇక ఒలింపిక్స్‌లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.30 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఏపీ రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ విన్నర్స్‌కు రూ.75 లక్షలు, సిల్వర్ గెలిస్తే రూ.50 లక్షలు, బ్రాంజ్ గెలిస్తే రూ.30 లక్షలు ఇవ్వనున్నారు. అందులో భాగంగానే సింధుకు ఆ నగదు బహుమతి ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు.
ఇక టోక్యో వెళ్లే ముందే ఏపీ అథ్లెట్లకు సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహకం కింద రూ. 5 లక్షల రూపాయలు అందజేశారు. సింధుతోపాటు మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్‌సాయిరాజ్, హాకీ ప్లేయర్ రజనిలు ఈ ప్రోత్సాహక నగదు బహుమతి అందుకున్నారు. ఆ సమయంలోనే విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయడానికి సింధుకు 2 ఎకరాల స్థలం కేటాయించినట్లు జగన్ ప్రకటించారు. ఇప్పటికే సింధు ఏపీ ప్రభుత్వ ఉద్యోగి. 2016లో ఆమె రియో గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆమెకు డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఇచ్చారు. అంతేకాదు అప్పట్లో రూ.3 కోట్ల నగదు కూడా అందించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా రూ.5 కోట్ల నగదు బహుమతిని సింధుకు ఇచ్చింది.