
టోక్యో: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ అందించాలనుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆశలు అడియాశలయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె స్వర్ణ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. వరుస విజయాలతో సెమీస్‌లోకి దూసుకెచ్చిన తెలుగు తేజం.. కెరీర్‌లో తనకు కొరకరాని కొయ్యగా మారిన తై జూ యింగ్(చైనీస్ తైపీ)ను ఓడించలేకపోయింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరో సీడ్ సింధు 18-21, 12-21 తేడాతో వరల్డ్ నెంబర్ వన్ తై జూ యింగ్ చేతులో వరుస గేమ్స్‌లో చిత్తయింది. సింధు ఇక బ్రాంజ్ మెడల్ కోసం చైనా ప్లేయర్ హే బింగ్‌జియోతో ఆదివారం తలపడనుంది.
ఓపెనింగ్ గేమ్‌లో 2-0తో వెనుకబడిన వెంటనే తైజూ తప్పిదాలతో సింధు 2-2తో సమం చేసింది. ఆ తర్వాత ఓవర్ హెడ్ స్మాష్‌తో 4-2 లీడ్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తై జూ యింగ్ వరుసగా తప్పిదాలు చేయడంతో లీడ్‌ను 11-8కి పెంచుకొని బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం సింధు అనవసర తప్పిదాలు చేయడంతో స్కోర్లు 12-12తో సమమయ్యాయి. డ్రాప్ షాట్స్‌తో చెలరేగిన తైజూయింగ్ లీడ్‌కు వెళ్లినా.. ఆ తర్వాత ఆమె అనవసర తప్పిదాలతో సింధు రేసులోకి వచ్చింది. కానీ తైజూ కూడా చెలరేగడంతో స్కోర్లు 14-14తో సమమయ్యాయి. ఆ తర్వాత తైజూయింగ్ డ్రాప్ షాట్స్‌తో పాయింట్లు సాధించగా.. సింధు స్మాష్‌లతో చెలరేగింది. దాంతో గేమ్ హోరాహోరీగా సాగింది. కానీ చివర్లో బాడీ లైన్ స్మాష్‌లతో వరుసగా పాయింట్లు సాధించిన తైజూయింగ్ 21-18తో గేమ్‌ను సొంతం చేసుకుంది.
సెకండ్ గేమ్‌లో తై జూయింగ్ శుభారంభం చేసినా.. క్రాస్ కోర్ట్ హెడ్ స్మాష్‌తో సింధు ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు సమం అయ్యాయి. కానీ ఆ తర్వాత అనవసర తప్పిదాలు చేసిన సింధు వరుసగా మూడు పాయింట్లు కోల్పోయింది. తీవ్ర ఒత్తిడికి లోనైనా తెలుగు తేజం అదే తప్పిదాలను రిపీట్ చేసింది. దాంతో తైజూ 11-7తో బ్రేక్‌కు వెళ్లింది. విరామం అనంతరం తైజూ వరుసగా రెండు పాయింట్లతో లీడ్‌ను మరింత పెంచుకోగా.. సింధు స్మాష్‌తో పాయింట్ సాధించినా జోరు కొనసాగించలేకపోయింది. తనపై తై జూ ఆధిపత్యం చెలాయించడంతో సింధు ఒత్తిడికి లోనైంది. తనకు అదృష్టం కూడా కలిసిరాలేదు. ఆమె క్రాస్ కోర్ట్ లైన్ షాట్స్ అన్ని మిస్ ఫైర్ అయ్యాయి. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన తై జూ 21-12తో గేమ్‌ను ముగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో సింధుపై ఆధిపత్యాన్ని తైజూయింగ్ 14-5కు పెంచుకుంది.