
సింగపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో శుభారంభం చేయగా.. యువ షట్లర్లు మిథున్ మంజునాథ్, అష్మిత చాలిహా సంచలన విజయాలు అందుకున్నారు.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 21-15, 21-11తో లియానె టాన్ (బెల్జియం)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. సైనా 21-18, 21-14తో మాళవిక బాన్సోద్‌పై గెలిచి ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో అశ్మిత చాలిహా 21-16, 21-11తో ప్రపంచ 12వ ర్యాంకర్ బుసానన్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయంతో ముందంజ వేసింది.
పురుషుల సింగిల్స్ భారత అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. సహచర ఆటగాడు, ప్రపంచ 77వ ర్యాంకర్ మిథున్ మంజునాథ్.. శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. తొలి రౌండ్లో మిథున్ 21-17, 15-21, 21-18తో 11వ ర్యాంకర్ శ్రీకాంత్‌పై విజయం సాధించాడు. గంటపాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో బాగా ఆడిన శ్రీకాంత్.. తర్వాతి రెండు గేమ్‌ల్లో నిరాశపర్చాడు. ప్రత్యర్థి కొట్టిన బలమైన స్మాష్‌లు, ర్యాలీస్‌ను ఎదుర్కోలేక ఏ దశలోనూ పుంజుకోలేకపోయాడు.
మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 21-13, 21-16తో సితికోమ్ తమాసిన్(థాయ్‌లాండ్) గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పారుపల్లి కశ్యప్ 14-21, 15-21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో నితిన్- పూర్విష జోడీ 21-15, 21-14తో మిషా జిల్బర్‌మన్- స్వెత్లానా జిల్బర్‌మన్ (ఇజ్రాయెల్) జంటపై నెగ్గి ముందంజ వేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పూజ- ఆరతి జోడీకి వాకోవర్ లభించింది.