
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డును గెలిచి ఈ ఘనతనందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కింది. ఆసియా- ఓసియానియా జోన్ నుంచి ఈ అవార్డు కోసం పోటీపడ్డ ఈ హైదరాబాద్ స్టార్ 10 వేలకు పైగా ఓట్లు పొంది ఈ ఘనతనందుకుంది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు విజేతను మే 1 నుంచి 8 వరకు జరిగిన ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా అభిమానులు నిర్ణయించారు. మొత్తం ఓట్లలో 60 శాతం సానియాకు రావడం.. ప్రపంచవ్యాప్తంగా ఆమెకున్న ప్రజాదరణకు నిదర్శనం.
'ఫెడ్ కప్ హార్ట్ అవార్డును గెలచుకున్న తొలి భారతీయురాలినైనందుకు చాలా గౌరవంగా ఉంది. ఈ అవార్డు దేశానికి నా అభిమానులందరికి అంకితమిస్తున్నాను.
నాకు ఓటేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని అవార్డులు తీసుకొస్తానని ఆశిస్తున్నా.'అని సానియా సంతోషం వ్యక్తం చేసింది.
ఇక ప్రతీ కేటగిరీ నుంచి విజేతలు 2000 డాలర్ల (రూ. లక్షా 51 వేలు) ప్రైజ్ మనీగా అందుకున్నారు. ఈ మొత్తాన్ని కరోనా కట్టిడిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి సానియా విరాళంగా ప్రకటించింది. 'యావత్ ప్రపంచం ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ ప్రైజ్‌మనీని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నా.'అని సానియా తెలిపింది.
ఆసియా- ఓసియానియా జోన్ నుంచి ఈ అవార్డు కోసం సానియా మీర్జాతో ప్రిస్కా మెడెలిన్ నుగ్రోరో (ఇండోనేసియా) పోటీపడింది. కుమారుడికి జన్మనివ్వడంతో సుదీర్ఘ విరామం తీసుకున్న సానియా.. నాలుగేళ్ల తర్వాత ఫెడ్ కప్‌లోకి అడుగుపెట్టింది. తన 18 నెలల కుమారుడు ఇజాన్‌ను స్టాండ్స్‌లో ఉంచి మ్యాచ్ ఆడి తొలిసారి భారత్ ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు సాయం చేసింది.