
హైదరాబాద్ : ఓవైపు కరోనా భయంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద టోర్నీలు రద్దవుతున్నా.. ఆల్ ఇంగ్లండ్ ఓపెనన్ మాత్రం ప్రణాళిక ప్రకారమే జరిగింది. దీనిపై భారత స్టార్ షట్లర్ సైనా నేహ్వాల్ అసహనం వ్యక్తం చేసింది. పైసల కక్కుర్తితోనే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ -2020 నిర్వహించారని ఆర్గనైజర్లపై సైనా తీవ్ర స్థాయిలో మండిపడింది.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ .. టోర్నీ నిర్వహించడంపై విమర్శలు గుప్పించింది. ఆటగాళ్ల సంక్షేమం, వారి భావాలు పట్టించుకోకుండా.. కేవలం డబ్బుల కోసమే వారు టోర్నీ నిర్వహించారని ఆమె ట్వీట్ చేసింది. అంతకుమించి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2020 నిర్వహించడానికి ఒక్క కారణం కూడా లేదని వాపోయింది.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ డెన్మార్క్ ప్లేయర్ మాడ్స్ కాన్రాడ్ పీటర్సన్ చేసిన ట్విట్‌కు బదులుగా సైనా ఈ విధంగా స్పందించింది.
'ఓవైపు కరోనా భయంతో ప్రపంచం అంతా ఆగిపోతుంటే.. నేను సాధారణ పరిస్థితుల మధ్య ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఆడినందుకు భయపడుతున్నా. భయంగా ఉంది. 14 రోజుల పాటు నేను అనారోగ్యంగానే ఉన్నానని భావించాల్సి ఉంటుంది' అని మాడ్స్ ట్వీట్ చేశారు.
ఇక, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 దెబ్బకు పెద్ద పెద్ద క్రీడా ఈవెంట్లను రద్దు చేయడమో, వాయిదా వేయడమో లేక ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించడమో చేస్తున్నారు. కానీ బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌ను మాత్రం సాధారణ పరిస్థితుల మధ్యనే నిర్వహించారు. ఈ టోర్నీలో సైనా తొలి రౌండ్‌లోనే చిత్తయింది. ఓవైపు వరుస పరాజయాలు.. మరోవైపు కరోనా వైరస్‌తో టోర్నీలు రద్దవ్వడం.. ఆమె ఒలింపిక్స్ బెర్త్ ఆశలను సంక్లిష్టం చేశాయి.