
హైదరాబాద్: మోకాలి గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైన స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ త్వరగా కోలుకోవాలని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కోరుకుంది. 2016 రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధును ఓడించిన మారిన్ గోల్డ్ మెడల్ అందుకుంది. అయితే గాయం కారణంగా ఒలింపిక్స్‌కు దూరంగా ఉంటున్నానని మారిన్ చేసిన ప్రకటనపై సింధు ట్విటర్ వేదికగా స్పందించింది.
'నీ గాయం గురించి తెలిసి చాలా బాధపడ్డా. త్వరగా రికవర్ అవ్వాలని, స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నా. చివరి ఒలింపిక్స్‌లో నీతో ఆడిన ఫైనల్ మ్యాచ్ గుర్తుకు వచ్చింది. నిజంగా ఓ గొప్ప మ్యాచ్ అది. అందుకే ఈసారి ఆ కాంపిటీషన్‌ను మిస్సవుతా. అదే విధంగా నిన్ను కోర్ట్‌లో చూడటాన్ని మిస్ అవుతా'అని సింధు ట్వీట్ చేసింది.
ఇక రెండు రోజుల క్రితమే మోకాలి గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు మారిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'పలు పరీక్షలు, డాక్టర్ కనసల్టేషన్ తరువాత నా ఎడమ మోకాలి లిగ్మెంట్‌లో చీలిక వచ్చినట్లు తేలింది. దాంతో సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీకెండ్‌లో నాకు సర్జరీ జరుగుతుంది. ఈ కఠిన సమయంలో నాకు అండగా నిలుస్తూ మెసేజ్‌లు పంపించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇది నాకు మరో ఎదురుదెబ్బ. దీన్ని నేను అధిగమించి అతి త్వరలో మీ ముందుకు వస్తాను. ఈ సమస్యతోనే గత రెండు నెలలుగా ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారింది. ఒలింపిక్స్ సమయానికి కోలుకున్నా టోర్నీ బరిలోకి దిగడం కష్టం.'అని మారిన్ ట్వీట్ చేసింది.
సింధుపై మారిన్‌దే పైచేయి. పలు టోర్నీల్లో పీవీ సింధుకు మారిన్ నుంచి సవాలు ఎదురయ్యేది. వరల్డ్ బ్యాడ్మింట్ చాంపియన్‌షిప్‌లో కూడా కరోలినా మారిన్ గైర్హాజరీలోనే సింధు గోల్డ్ మెడల్ గెలిచింది. చైనా వాల్‌ను జయించినా.. మారిన్‌ను ఓడించడం సింధూకి చేతనయ్యేది కాదు. ఇప్పుడు మారిన్ తప్పుకోవడంతో టోక్యో ఒలింపిక్స్‌లో సింధు మెడల్ అవకాశాలు మెరుగయ్యాయి.