సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు దుమ్మురేపారు. ఏకంగా మూడు టైటిళ్లు గెలిచి సత్తా చాటారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత స్టార్ల షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. సింగిల్స్ టైటిల్స్ సాధించగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా జోడీ విజేతగా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం మూడు టైటిళ్లు దక్కాయి.
సత్తా చాటిన సింధు..
మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ సింధు 21-14, 21-16తో చెన్నై చెందిన వు లు యుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ అసాంతం ఆధిపత్యం చెలాయించిన సింధు వరుసగా రెండు గేమ్స్ గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. 2017, 2022 తర్వాత సింధు ఈ టోర్నీ విజేతగా నిలిచి మూడో టైటిల్ కైవసం చేసుకుంది.

దుమ్మురేపిన లక్ష్యసేన్..
పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్ ఓటమి తర్వాత నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్న లక్ష్యసేన్.. ఈ టోర్నీలో మాత్రం విజేతగా నిలిచాడు. ఆదివారమే జరిగిన ఫైనల్లో 21-6, 21-7 తేడాతో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జేసన్ తేపై విజయం సాధించాడు.
డబుల్స్ గెలిచిన గోపీచంద్-ట్రీసా
మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డ్ సాధించింది. ఫైనల్లో ట్రీసా జాలీ జోడీ 21-18, 21-11 తేడాతో బావో లి జింగ్,లీ కియాన్(చైనా) ద్వయంపై గెలిచింది. ఈ జోడీ 2022లో రన్నరప్‌గా నిలిచింది.
మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్‌లో నిరాశే..
మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్‌లో మాత్రం భారత షట్లర్లకు నిరాశే మిగిలింది. రెండు జోడీలు ఫైనల్లోనే ఓటమిపాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఐదో సీడ్ తనీషా-ధ్రువ్ 21-18, 14-21, 8-21 తేడాతో ధాయ్‌లాండ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్ ఫైనల్లో పృథ్వీ-ప్రతీక్ జోడీ పోరాడింది. 71 నిమిషాలపాటు సాగిన టైటిల్ పోరులో 14-21, 21-19, 17-21 తేడాతో హువాంగ్ డి, లియు యాంగ్(చైనా) ద్వయం భారత జోడీపై గెలుపొందింది.