పారిస్ ఒలింపిక్స్ 2024లో లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన కాంస్యపోరులో లక్ష్యసేన్ 21-13, 16-21, 11-21 తేడాతో మలేషియా షట్లర్ లీ జి జియా చేతిలో ఓటమిపాలయ్యాడు. కాంస్య పతకం కోసం చివరి వరకు పోరాడిన లక్ష్యసేన్ అనవసర తప్పిదాలతో మూల్యంచెల్లించుకున్నాడు. అతని మోచేతి గాయం తిరగబెట్టడం కూడా విజయవకాశాలను దెబ్బతీసింది.
60 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక లక్ష్యసేన్ ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌ను సునాయసంగా గెలుచుకున్న అతను రెండో గేమ్‌లోనూ అదే జోరుతో ఆధిక్యం సాధించాడు. కానీ ఆ తర్వాత లీ అద్భుతంగా పుంజుకొని వరుసగా రెండు గేమ్స్ గెలిచి కాంస్య పతకం సాధించాడు. లక్ష్యసేన్ ఓటమితో పతకం లేకుండానే భారత షట్లర్ల పోరాటం ముగిసింది.

ఫస్ట్ గేమ్ సునాయసంగా..
తొలి గేమ్‌లో ప్రత్యర్థి లీ జి జియా తప్పిదంతో శుభారంభం చేసిన లక్ష్య సేన్ అదే జోరులో 11-6తో ఐదు పాయింట్స్ ఆధిక్యం సాధించాడు. సూపర్ స్మాష్‌లతో పాటు డ్రాప్ షాట్స్‌తో లక్ష్య సేన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. లీ జి జియా తప్పుడు నిర్ణయాలు లక్ష్యసేన్‌కు కలిసొచ్చాయి.
సుదీర్ఘమైన ర్యాలీ ఆడిన ఈ ఇద్దరూ.. జడ్జ్‌మెంట్‌లో తప్పటడుగు వేసాడు. ముఖ్యంగా మలేషియా షట్లర్ పదే పదే మిస్ జడ్జ్‌మెంట్‌తో లక్ష్యసేన్‌కు పాయింట్స్ ఇచ్చుకున్నాడు. దూకుడుగా ఆడిన లక్ష్యసేన్ మిడ్ కోర్ట్ షాట్స్‌తో పాయింట్స్ సాధించి 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
అనవసరం తప్పిదాలతో..
రెండో గేమ్‌ను కూడా అద్భుతంగా ప్రారంభించిన లక్ష్యసేన్.. సూపర్ స్మాష్‌లు, అటాకింగ్ అప్రోచ్‌తో 8-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ పరిస్థితుల్లో అద్భుతంగా పుంజుకున్న మలేషియా షట్లర్.. వరుసగా 8 పాయింట్స్ సాధించి 11-8తో మూడు పాయింట్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మరింత దూకుడుగా ఆడిన లీ.. లక్ష్యసేన్‌పై ఒత్తిడి పెంచాడు.
ఈ పరిస్థితుల్లో లక్ష్యసేన్ స్మాష్‌తో 12-12 స్కోర్లు సమం చేశాడు. లీ పుంజుకొని ఆధిక్యం సాధించాడు. కానీ క్రాస్ కోర్ట్ ప్లేస్‌మెంట్స్‌తో లక్ష్యసేన్ ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ మూడు పాయింట్స్ ఆధిక్యాన్ని చివరకు కొనసాగించిన లీ.. 21-16తో రెండో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. దాంతో డిసైడర్ గేమ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తేలిపోయిన లక్ష్యసేన్..
మూడో గేమ్‌లో అటాకింగ్ అప్రోచ్‌తో బరిలోకి దిగిన లీ వరుస పాయింట్స్‌తో శుభారంభం అందుకున్నాడు. లాంగ్ ర్యాలీతో లీ సహనాన్ని పరీక్షించిన లక్ష్యసేన్ అతని జోరుకు బ్రేక్ వేసాడు. కానీ అద్భుతంగా పుంజుకున్న లీ 6-2తో 4 పాయింట్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మోచేతి గాయంతో కాస్త ఇబ్బంది పడిన లక్ష్యసేన్.. ప్రత్యర్థి ఆటగాడి ఆధిపత్యం ముందు తేలిపోయాడు. రిటర్న్ షాట్స్‌తో షటిల్‌ను పదే పదే బయటకు కొట్టాడు.
అంతేకాకుండా తప్పుడు జడ్జిమెంట్‌తో పాయింట్స్ చేజార్చుకున్నాడు. దాంతో లీ 9-2తో 7 పాయింట్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. లాంగ్ ర్యాలీలతో లక్ష్యసేన్ వరుసగా మూడు పాయింట్స్ సాధించి 10-5తో ఆధిక్యాన్ని తగ్గించాడు. కానీ క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో పాటు తనకే సాధ్యమైన నెట్ ప్లేతో లీ వరుస పాయింట్స్ సాధించాడు.