భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ 2024 బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు తీవ్రంగా నిరాశపరిచారు. క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓటమిపాలై ఇంటి దారి పట్టారు. గురువారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్లో రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి 21-13, 14-21, 16-21 తేడాతో ఆరోన్-సో వూయి(మలేషియా) చేతిలో ఓటమిపాలయ్యారు.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన మలేషియా జంటపై తొలి గేమ్‌లో విజయం సాధించిన సాత్విక్ చిరాగ్.. రెండో గేమ్‌లో మాత్రం తేలిపోయింది. ఆరంభలో 4-0తో మలేషియా జంట ఆధిపత్యం చెలాయించిన భారత ద్వయం.. అనూహ్యంగా వెనకబడింది. మలేషియా జోడీ పుంజుకొని చెలరేగడంతో 14-21తో సాత్విక్-చిరాగ్ జోడీ గేమ్ కోల్పోయింది.

మూడో గేమ్‌లో 2-5తో వెనుకబడిన భారత ద్వయం జోరు పెంచి 5-5తో స్కోర్‌ను సమం చేసింది. తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఓ దశలో 16-16 స్కోర్లు సమం అయ్యాయి. కానీ ఒత్తిడికి చిత్తయిన భారత ద్వయం అనవసర తప్పిదాలతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజార్చుకొని ఇంటిదారి పట్టింది. ఒత్తిడిలో సర్వీస్ వేరియేషన్స్ చూపించడంలో సాత్విక్-చిరాగ్‌లు ఇబ్బంది పడ్డారు.
లక్ష్యసేన్ ముందంజ!
పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన క్వార్టర్ ఫైనల్ చేరాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-12, 21-6 తేడాతో భారత్‌కే చెందిన హెచ్ ఎస్ ప్రణయ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన లక్ష్యసేన్ ఏక పక్షంగా మ్యాచ్‌ను ముగించాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ కనీస పోటీ ఇవ్వలేకపోయాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్.. చైనీస్ తైపీ షట్లర్ టీసీ చౌతో తలపడనున్నాడు.