కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ 2023 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రణయ్ తీవ్రంగా శ్రమించాడు.
డ్రాప్ షాట్లు, సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ లతో తొలి గేమ్ నుంచే ప్రతీ పాయింట్ కోసం ఇద్దరూ షట్లర్లు పోటాపోటీగా ఆడారు. ప్రణయ్ అసాధారణ ఆటతో ఆధిపత్యం చెలాయించి తొలి గేమ్‌లో గెలుపొందాడు. రెండో గేమ్‌లో చైనా షట్లర్ ధీటుగా బదులివ్వడమే కాకుండా ప్రణాయ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.

దాంతో భారత షట్లర్ తప్పిదాలు చేయగా.. యాంగ్ అదే జోరును కొనసాగించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో ఫలితం డిసైడర్ గేమ్‌పై ఆధారపడగా.. ప్రణయ్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా చెలరేగాడు. ప్రత్యర్థి జోరు కనబర్చినా చాకచక్యంగా ఆడి గేమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు టైటిల్‌ను ముద్దాడాడు.
క్రిస్టియన్ అడింటా (ఇండోనేసియా)తో జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ తొలి గేమ్‌లో 19-17తో ఆధిక్యంలో ఉండగా.. ప్రత్యర్థి మోకాలి గాయంతో తప్పుకున్నాడు. ఒక షాట్‌ను ఎగిరి రిటర్న్ చేసే ప్రయత్నంలో క్రిస్టియన్ గాయపడి ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో ప్రణయ్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
ఇదే టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో వెనుదిరగ్గా.. శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారపట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణయ్ అసాధారణ ఆటతో టైటిల్ గెలిచాడు. శనివారం మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఆరో సీడ్ సింధు 14-21, 17-21తో ఏడో సీడ్ మరిస్కా టాన్‌జంగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడింది.