భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 21-11 తేడాతో జపాన్ ప్లేయర్ యూషీ తనాకాను ఓడించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన మూడో భారత షట్లర్‌గా రికార్డ్ సాధించాడు. గతంలో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఈ ఘనతను అందుకున్నారు.
ఈ సీజన్‌లో లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్ కాగా.. కెరీర్‌లో మూడో సూపర్ 500 ట్రోఫీని ముద్దాడాడు. 38 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో లక్ష్యసేన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా రెండు సెట్లలో ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.

శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్ 17-21, 24-22, 21-16 తేడాతో ప్రపంచ ఆరో ర్యాంక్ ప్లేయర్ చౌతిన్ చెన్‌పై విజయం సాధించాడు. ఈ పోరు ఆరంభంలో లక్ష్య తడబడ్డాడు. కాస్త ఆలస్యంగా పుంజుకున్న లక్ష్యసేన్.. తొలి గేమ్ కోల్పోయినా.. తర్వాతి రెండు గేమ్స్ గెలుచుకొని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఫైనల్లో మాత్రం లక్ష్యసేన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యర్థి యుషి తనకాను ఓడించి టైటిల్ అందుకున్నాడు.