యోసు (కొరియా): భారత డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మరో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ -500 బ్యాడ్మింటన్ టోర్నీలో అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచారు.
ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ సాత్విక్-చిరాగ్ 17-21, 21-11, 21-13 తేడాతో టాప్ సీడ్, ఇండోనేషియా జోడీ ఫజర్ అలిప్‌యాన్-ముహమ్మద్ రియాన్‌లను ఓడించింది. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఇక కొరియా ఓపెన్ టైటిల్ గెలవడం సాత్విక్-చిరాగ్ జోడీకి ఇదే తొలిసారి. దాదాపు 60 నిమిషాల పాటు సాగిన ఫైనల్ పోరులో ఇరు జోడీలు హోరా హోరీగా తలపడ్డాయి. తొలి గేమ్‌లో ఇండోనేషియా షట్లర్లు ఆధిపత్యం చెలాయించడంతో భారత జోడీ కాస్త వెనకబడింది.
4-2తో మొదటు పెట్టిన ఇండోనేషియా జోడీ.. వరుసగా 6 పాయింట్లు సాధించి 11-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత జోడీ ప్రతిఘటించినా.. ఏమాత్రం అవకాశం ఇవ్వని ఇండోనేషియా ద్వయం 21-17తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీ మొత్తంలో భారత ద్వయం తొలి గేమ్‌ను ఓడిపోవడం ఇదే తొలిసారి.
తప్పిదాల నుంచి పాఠం నేర్చుకున్న సాత్విక్-చిరాగ్ రెండో గేమ్‌లో దుమ్మురేపారు. 5-4తో ఆధిక్యంలో వెళ్లి అదే జోరును కొనసాగించారు. బలమైన స్మాష్‌లతో 15-10తో లీడ్‌ను డబుల్ చేసుకున్న భారత ద్వయం వరుసగా 6 పాయింట్లు సాధించి 21-11 తేడాతో గేమ్‌ను సొంతం చేసుకుంది. దాంతో డిసైడర్ గేమ్ ఆడాల్సి వచ్చింది. తుది గేమ్‌ను కూడా సాత్విక్-చిరాగ్‌లు అద్భుతంగా ఆరంభించారు. ఆరంభంలోనే 6-3తో ఆధిక్యం సాధించి అదే జోరును కొనసాగించారు.
ఎలాంటి తప్పిదం చేయకుండా.. ఆధిక్యాన్ని కొనసాగించిన భారత్ ద్వయం 21-13తో మూడో గేమ్‌ను గెలవడంతో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఇండోనేసియా 1000 సూపర్ సిరీస్ టోర్నీతో పాటు స్విస్ ఓపెన్ 500 టైటిల్‌ను కూడా సాత్విక్ ద్వయం ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
సింగిల్స్‌లో సింధు, శ్రీకాంత్, ప్రణయ్ లాంటి భారత స్టార్ షట్లర్లు విఫలమవుతున్నా.. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.