
బ్యాంకాక్: థాయ్‌లాండ్ హెల్త్ అఫిషియల్స్ తీరుపై భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశాడు. కరోనా వైరస్ పరీక్షలో భాగంగా శాంపిల్స్ సేకరించే క్రమంలో తనతో వైద్యులు దురుసుగా ప్రవర్తించడంతో ముక్కు నుంచి రక్తం కారిందని శ్రీకాంత్ వాపోయాడు. రక్తం కారుతున్న ఫొటోను ట్వీట్ చేశాడు. తనతో వారు సరైన రీతిలో వ్యవహరించలేదని, కరోనా పరీక్షలు నిర్వహించే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు.. టోర్నీకి వచ్చే ముందు తాను నాలుగుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
'మ్యాచ్‌ల కోసం మమ్మల్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక్కడికి వచ్చింది ఇలా రక్తం కార్చేందుకు కాదు. బ్యాంకాక్‌లో కరోనా టెస్ట్‌ల కోసం నాలుగుసార్లు శాంపిల్స్ ఇచ్చా. ఇందులో ఒక్కటీ సరిగ్గా జరగలేదు. ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదు'అని శ్రీకాంత్ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన బీడబ్ల్యూఎఫ్ అతనికి వైద్య సాయం ఏర్పాటు చేసింది.
ఇక సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్ ప్రణయ్ విషయంలో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. షట్లర్లకు కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో కలకలం రేగింది. ఉదయం చేసిన పరీక్షల్లో సైనా, ప్రణయ్‌లకు కరోనా పాజిటీవ్ తేలడంతో వారిని ఐసోలేషన్‌కు పంపిన అధికారులు వెంటనే టోర్నీని నుంచి తప్పించారు. కరోనా నెగటివ్‌గా తేలినప్పటికీ సైనాతో రూమ్ షేర్ చేసుకుంటున్న ఆమె భర్త పారుపల్లి కశ్యప్‌ను కూడా టోర్నీ ఆడకుండా బయటకు పంపారు.
ఫస్ట్ రౌండ్‌లో వీళ్లతో ఆడాల్సిన ప్రత్యర్థులకు వాకోవర్ కూడా ఇచ్చేశారు. అయితే, మంగళవారం సాయంత్రం చేసిన టెస్ట్‌ల్లో సైనా, ప్రణయ్ కరోనా నెగటివ్‌గా తేలడంతో మళ్లీ టోర్నీలోకి ప్రవేశం కల్పించారు. భారత షట్లర్ల ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లను బుధవారానికి రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) చేసిన ప్రకటనతో భారత టీమ్ ఊపిరి పీల్చుకుంది.