టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీకి చుక్కెదురైంది. క్వార్టర్ ఫైనల్లోనే భారత డబుల్స్ ద్వయం ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. మరోస్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఇంటిదారి పట్టాడు.
శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం సాత్విక్-చిరాగ్ 15-21, 25-23, 16-21 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్-వాంగ్ లిన్ చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్‌ను కోల్పోయిన భారత ద్వయం.. రెండో సెట్‌ను కష్టపడి సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్‌లో ఇరు జోడీలు హోరాహోరీగా తలపడ్డాయి.

కీలక సమయంలో అనవసర తప్పిదాలు చేసిన భారత్ జోడీ వరుసగా పాయింట్లు కోల్పోయి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ పరాజయంతో వరుసగా 12 మ్యాచ్‌లు నెగ్గిన సాత్విక్-చిరాగ్ జోడీకి తొలి ఓటమి ఎదురైంది. ఇటీవలే ముగిసిన కొరియా ఓపెన్ టైటిల్‌ను సాత్విక్-చిరాగ్ జోడీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
శుక్రవారమే జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 21-19 తేడాతో జపాన్ షట్లర్ కొకి వతనబేను ఓడించాడు. వరుస గేమ్‌ల్లో జపాన్ ప్లేయర్‌ను మట్టికరిపించాడు. గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్‌గా నిలిచిన లక్ష్యసేన్ ఇటీవలే కెనడా ఓపెన్ సూపర్ 500 టోర్నీ విజేతగా కూడా నిలిచాడు.
తాజా జపాన్ ఓపెన్‌లోనూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. సెమీఫైనల్లో ఇండోనేషియా షట్లర్ జోనాథన్ క్రిస్టీతో లక్ష్యసేన్ తలపడాల్సి ఉంటుంది.
మరో భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారిపట్టాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 19-21, 21-18, 21-8 తేడాతో డెన్మార్క్ షట్లర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిపాలయ్యాడు.
తొలి సెట్‌లో ఆధిపత్యం చెలాయించిన ప్రణయ్.. రెండో గేమ్‌లో తేలిపోయాడు. టాప్ సీడ్ ప్లేయర్ ఆటకు ప్రణయ్ దగ్గర సమాధానమే లేకపోయింది. భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ విజేత పీవీ సింధు ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే వెనుదిరగ్గా.. కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లో ఇంటిదారిపట్టాడు.