టోక్యో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వైఫల్యం కొనసాగుతోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలోనూ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 12-21, 13-21 తేడాతో చైనాకు చెందిన జాంగ్ యి మన్ చేతిలో ఓటమిపాలైంది.
ఈ ఏడాది ఆడిన 13 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో సింధు ఏడింటిలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టడం గమనార్హం. ఒలింపిక్స్‌కు సరిగ్గా ఏడాది సమయం ఉండగా.. సింధు వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. 30 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో చైనా షట్లర్ ఆధిపత్యం ముందు సింధు తేలిపోయింది. ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

తొలి గేమ్ ఆరంభం నుంచే జాంగ్ యి మన్ దూకుడు కనబర్చగా.. సింధు వెనకబడింది. వరుస పాయింట్లతో దూసుకెళ్లిన చైనా షట్లర్ 21-12తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ అదే ఆధిపత్యం కొనసాగించిన చైనా షట్లర్ బలమైన స్మాష్‌లతో సింధుపై విరుచుకుపడింది. సింధు తేరుకునేలోపే 13-21తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఈ ఏడాది నాలుగు టైటిళ్లు గెలిచి జోరు మీదున్న భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌లు జపాన్ ఓపెన్‌లోనూ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కొరియా ఓపెన్ ఛాంపియన్స్ 21-16, 11-21, 21-13 తేడాతో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాడో, డేనియల్ మార్టిన్ ద్వయాన్ని ఓడించారు. రెండో గేమ్‌లో తేలిపోయినా.. మూడో గేమ్‌లో సత్తా చాటి విజయాన్నందుకున్నారు.
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-15, 12-21, 24-22 తేడాతో భారత్‌కే చెందిన ప్రియాన్షు రావత్‌ను ఓడించాడు. మంగళవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. రెండో రౌండ్‌లో ఈ ఇద్దరే తలపడనున్నారు.