ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో సెమీ ఫైనల్ చేరి టైటిల్ ఆశలు రేకెత్తించిన సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్ చేరలేకపోయింది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ ద్వయం 18-21, 14-21 తేడాతో మలేషియా జోడీ గో స్జే ఫీ-నూర్ ఇజ్జుద్దీన్ చేతిలో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో మలేషియా జోడీ ముందు భారత్ ద్వయం తేలిపోయింది. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చినా.. రెండో గేమ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. దాంతో ఈ మ్యాచ్‌ను మలేషియా ద్వయం ఏకపక్షంగా గెలుచుకుంది. సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమితో ఈ టోర్నీలో భారత్ కథ ముగిసింది.

శుక్రవారమే స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైన విషయం తెలిసిందే. వివాహం అనంతరం ఈ టోర్నీలోనే బరిలోకి దిగిన సింధు అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ చేరింది. కానీ ఇండోనేషియా ప్లేయర్, పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ మరిస్కా తుంజుంగ్ చేతిలో ఖంగుతిన్నది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 9-21, 21-19, 17-21తో పోరాడి ఓడింది. పురుషుల క్వార్టర్స్‌లో కిరణ్ జార్జ్ 13-21, 19-21 తేడాతో యాంగ్ వెంగ్(చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు.