ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. వివాహం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలో సింధు సాధికారిక ప్రదర్శనతో రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో రెండు సార్లు ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన సింధు 21-15, 21-13 తేడాతో జపాన్‌కు చెందిన మనమి సూజుపై విజయం సాధించింది.
ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. హైదరాబాద్‌లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తనకంటే తక్కువ ర్యాంక్ కలిగిన జపాన్ షట్లర్‌పై తనదైన ఆటతో విరుచుకుపడింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో చెలరేగిన సింధు.. వరుస గేమ్‌ల్లో గెలిచి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.

అక్టోబర్ 2024 తర్వాత సూపర్ 750 టోర్నీల్లో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. గతేడాది నవంబర్‌లో సింధు సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మలేసియా ఓపెన్‌కు దూరంగా ఉన్న సింధు.. వివాహం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలో సత్తా చాటింది.
తొలి రౌండ్‌లో సింధు 21-14, 22-20తో యున్ సుంగ్(చైనీస్ తైపీ)పై విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింధు.. ఇండోనేషియా ప్లేయర్ జీఎమ్ టన్‌జంగ్‌తో తలపడనుంది. నాలుగో సీడ్ ప్లేయర్ అయిన టన్‌జంగ్‌తో సింధుకు కఠిన సవాల్ తప్పదు.
ఈ విజయంపై సింధు సంతోషం వ్యక్తం చేసింది. 'చాలా సంతోషంగా ఉంది. తొలిసారి మనమి సూజుతో తలపడ్డాను. ఈ మ్యాచ్‌లో కొన్ని సుదీర్ఘ ర్యాలీలు జరిగాయి. ఈ మ్యాచ్‌లో నేను 100 శాతం ఇవ్వగలిగినందుకు సంతోషంగా ఉన్నాను. రేపటి కోసం నేను కోలుకొని మరింత బలంగా తిరిగి రావాలి.'అని విజయానంతరం సింధు తెలిపింది.
మరో మ్యాచ్‌లో అనుపమ ఉపాధ్యాయ 6-21, 9-21 తేడాతో జపాన్ స్టార్ టోమోకా మియాజకి చేతిలో చిత్తయ్యింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రిక్వార్డర్స్‌లో కిరణ్ జార్జ్ 22-20, 21-13 తేడాతో ఫ్రాన్స్ షట్లర్ ఏ లానియర్‌ను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో పోరాటం రెండో రౌండ్‌లోని ముగిసింది. భారత ద్వయం 9-21, 21-23 తేడాతో జపాన్ ద్వయం మట్స్‌మోటో-ఫుకుషిమా చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో చిత్తయిన.. రెండో గేమ్‌లో భారత్ ద్వయం గట్టి పోటీనిచ్చింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది.