అతను నాపై ఎన్నో కుట్రలు చేశాడు: గుత్తా జ్వాల
భారత బ్యాడ్మింటన్ వ్యవస్థపై మాజీ ప్లేయర్ గుత్తా జ్వాలా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆటగాళ్ల అభివృద్ధిలో గుత్తాధిపత్యం, పక్షపాతం ఉన్నాయని ఆరోపించారు. దేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధి కోసం తాను చేసిన సేవలకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అకాడమీ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు అధికారులను పదేపదే సంప్రదించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.
ప్రముఖ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుత్తా జ్వాల తన ఆవేదనను పంచుకున్నారు. అప్పటి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) అధ్యక్షుడు వీకే వర్మ, ఇతర కోచ్‌లు తన కెరీర్‌ను దెబ్బతీయాలని చూశారని ఆమె ఆరోపించారు.
అస్తవ్యస్తంగా బ్యాడ్మింటన్..
'బ్యాడ్మింటన్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థంగా ఉంది. ఇక్కడ పూర్తిగా గుత్తాధిపత్యం నడుస్తోంది. ఒకే వ్యక్తి అన్ని నిర్ణయిస్తాడు. నాకు కూడా ఒక అకాడమీ ఉందని నాలుగేళ్లుగా చెబుతున్నా. హైదరాబాద్‌లోని నా అకాడమీ దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 కోర్టులు ఉన్నాయి. ఇదంతా నేను స్వయంగా నా ఇష్టంతో నిర్మించుకున్నాను.

అయినా సరే నాకు ఎలాంటి మద్దతు లభించడం లేదు. నాకు అండర్ 19 లేదా సీనియర్ క్యాంపులు వద్దు. అండర్-13, అండర్ 15 ఆటగాళ్లను ఇవ్వండి. పిల్లలు బాగా ఆడతారు. తర్వాత వారు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. నేను ముక్కుసూటిగా మాట్లాడతా. దాంతో నా అకాడమీలో శిక్షణ పొందిన వారంతా తిరుగుబాటుదారుగా తయారవుతారని ప్రచారం చేస్తున్నారు.
మా విజయాన్ని పట్టించుకోలేదు..
2010 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో స్వర్ణం గెలిచినా వీకే వర్మ పట్టించుకోలేదు. కానీ రెండు గంటల తర్వాత సైనా గెలవగానే అతడు కోర్టులోకి పరుగెత్తుకెళ్లి సంబరాలు చేసుకున్నాడు. మా స్వర్ణం తక్కువేమీ కాదు కదా? అని నేను ఆనాడే ఆయనను ప్రశ్నించాను.
వీకే వర్మ నా కెరీర్‌ను దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 2006లో ఎలాంటి కారణం చెప్పకుండా జట్టు నుంచి తొలగించారు. రియో ఒలింపిక్స్ తర్వాత కూడా అలానే చేశారు. ఏ క్రీడాకారుడూ, క్రీడాకారిణి వివాదాలు కోరుకోరు. కానీ నా హక్కుల కోసం నేను పోరాడాల్సి వచ్చింది. ఎలాంటి ఆర్థిక మద్దతు, స్పాన్సర్‌షిప్ లేకుండానే నేను వరల్డ్ నంబర్ 5కి చేరుకున్నాను. అదే మద్దతు ఉండి ఉంటే నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచేదానిని. క్రీడా వ్యవస్థలో మార్పు రావాలి. నేటి క్రీడారంగంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారి మాటే నెగ్గుతోంది.
ఆటగాళ్లు మాట్లాడాలి..
బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఇటీవల సాత్విక్ అన్నాడు. ఆటగాళ్లు నోరు విప్పనప్పుడు ఎందుకు పట్టించుకుంటారు. ఒకస్థాయికి చేరుకున్న ఆటగాళ్లు దేశ బ్యాడ్మింటన్ తరఫున మాట్లాడాలి. లోపాలను ఎత్తి చూపాలి. మీరు రాణిస్తున్నంత కాలం, తగిన గుర్తింపు ఉన్నంత కాలం ఎవరూ ఏం చేయలేరు.
బ్యాడ్మింటన్ ఆడటం ఆపేసిన తర్వాత ఆట గురించి మాట్లాడటం ఆపేస్తే.. ఎవరూ మిమ్మల్ని గుర్తించరు. కెరీర్‌లో నేను ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. కానీ నాకు నా కుటుంబం అండగా నిలిచింది. వారి మద్దతు వల్లే నేను అసోసియేషన్‌కు వ్యతిరేకంగా పోరాడగలిగాను. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బలహీనుల కోసం మాట్లాడకపోతే మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది? .'అని గుత్తా జ్వాల చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications