చరిత్ర సృష్టించిన గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!
భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ సెమీస్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసింది. దాంతో 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు పతకం రానుంది. చివరిసారిగా 2011లో అశ్విని పొన్నప్ప-జ్వాల గుత్తా జోడీ కాంస్య పతకం సాధించింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ గాయత్రి-ట్రీసా జోడీ 16-21, 21-15, 21-13 తేడాతో చైనా ద్వయం జియా యి ఫాన్-ఝాంగ్ షు జియాన్ జోడీని ఓడించింది. ఇటీవలే అర్జున అవార్డ్‌ను గెలుచుకున్న గాయత్రి గోపిచంద్ తన సత్తా ఏంటో చాటి చెప్పింది. ట్రీసా జాలీతో కలిసి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన గాయత్రి జోడీకి తొలి గేమ్‌లో పరాజయం ఎదురైంది.
చైనా షట్లర్లు జియా యి ఫాన్- ఝాంగ్ షు జియాన్ జోడీ 21-16 తేడాతో తొలి గేమ్‌ను గెలుచుకుంది. కానీ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని భారత జోడీ అద్భుతంగా పుంజుకొని రెండో గేమ్‌లో 21-15తో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది.

ఇక నిర్ణయాత్మక పోరులోనూ గాయత్రి-ట్రీసా జోడీ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆరంభంలో కాస్త పోటీ ఎదురైనా నిలబడింది. చివరికి 21-13 తేడాతో మూడో గేమ్‌ను గెలుచుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లోనూ విజయం సాధిస్తే.. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుకున్న తొలి భారత మహిళల జోడీగా గాయత్రి-ట్రీసా చరిత్రకెక్కుతుంది.
ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆరో మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన సింధుకు ప్రిక్వార్టర్స్‌లో అనూహ్య షాక్ తగిలింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో పీవీ సింధు 11-21, 21-15, 17-21 తేడాతో వరల్డ్ నెంబర్ 3 వాంగ్ జి యీ(చైనా) చేతిలో ఓడింది. 1 గంట 28 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
పురుషుల సింగిల్స్‌లో యువ కెరటం ఆయుష్ శెట్టి పోరాటం కూడా ముగిసింది. ప్రిక్వార్ట్స్‌లో అతను 19-21, 11-21తో ప్రపంచ 12వ ర్యాంక్ ఆటగాడు ఫర్హాన్(ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. భారత డబుల్స్ జోడీ సాత్విక్-సాయిరాజ్ చిరాగ్ శెట్టి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-23, 21-19, 21-17తో జునైది ఆరిఫ్-యాప్ రాయ్(మలేసియా)ద్వయంపై గెలుపొందింది. ప్రత్యర్థి జంట నుంచి గట్టి పోటీ ఎదురైనా.. తొలి గేమ్ కోల్పోయినా.. భారత్ జోడీ ముందంజ వేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
