భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. శభాష్.. గుత్తా జ్వాల అంటూ నెటిజన్లు ఆమె చేసిన పనిని కొనియాడుతున్నారు. కొందరు మహిళలు తమ అందం, పొంకం సడలిపోతుందనే భ్రమతో పిల్లలను కనేందుకే అయిష్టత చూపుతున్న ఈ కాలంలో గుత్తా జ్వాల తనకు ఎక్కువగా ఉన్న 6.7 లీటర్ల పాలను దానం చేసింది. నీలోఫర్‌కు అనుబంధంగా పనిచేసే ఓ మిల్క్ బ్యాంకు ద్వారా ఆమె ఈ దానం చేసింది. నీలోఫర్ పిల్లల ఆసుపత్రికి వచ్చే శిశువులకు ఈ చనుబాలను సదరు బ్యాంకు అందిస్తోంది.
అందం పోతుందని సరోగసి ద్వారా పిల్లలను కంటూ ఆయాల చేత పెంచుతున్న సెలెబ్రిటీలు ఉన్న ఈ రోజుల్లో గుత్తా జ్వాలా ఎలాంటి సంకోచాలు మనసులోకి రానివ్వకుండా తన సంతానానికి సరిపోగా మిగిలే పాలను లీటర్ల కొద్దీ దానం చేయడం గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎంతో మంది సెలబ్రిటీలకు ఆమె స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు. ఆమె చేసిన పని చనుబాల దానంపై ఉన్న అపోహల్ని కూడా దూరం చేస్తోందని మెచ్చుకుంటున్నారు. నవజాత శిశువులకు చనుబాలు చాలా ముఖ్యమని, గుత్తా జ్వాల తరహాలో మిగతా సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి మహిళలందరికి అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

తమిళ హీరో విష్ణు విశాల్‌ను గుత్తా జ్వాలా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఏప్రిల్‌లో వారికి పాప పుట్టింది. విష్ణు విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి జ్వాల గుత్తాను కలిశాడు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. జ్వాల గుత్తా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు.
ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. వారికి ఆర్యన్ అనే నాలుగేళ్ల కుమారుడున్నాడు.