
ఒడెన్స్: టోక్యో ఒలింపిక్స్ తర్వాత విశ్రాంతి తీసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో సింధు వరుస గేమ్స్‌లో గెలిచి తొలి రౌండ్‌ను సులువుగా ధాటింది. ఆమెతో పాటు భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ కూడా బోణీ కొట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ సింధు 21-12, 21-10 తేడాతో 29వ ర్యాంకర్ నెస్లిహన్ యిగిట్(టర్కీ)ను ఓడించింది. సింధు రెండోరౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఓంగ్బామ్‌రున్‌పాన్‌తో ఆడనుంది.
పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-14,21-11తో సహచర ఆటగాడైన సాయిప్రణీత్‌పై గెలుపొంది రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో 28వ ర్యాంకర్ సమీర్ వర్మ 21-17, 21-14తో 21వ ర్యాంకర్ కున్లవుట్ విటిడ్సార్న్(థాయ్‌లాండ్)ను ఓడించాడు.
కాగా, పురుషుల డబుల్స్‌లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఏడో సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ 23-21, 21-15తో ఇంగ్లండ్‌కు చెందిన కలమ్ హెమింగ్-స్టీవెన్ స్టాల్‌వుడ్‌పై గెలుపొందగా.. ఎంఆర్ అర్జున్-ద్రువ్ కపిల్ జోడీ 21-19, 21-15 తేడాతో ఇంగ్లండ్‌కే చెందిన 17వ ర్యాంకర్ బెన్ లేస్-సీన్ వెండిపై నెగ్గి ముందంజ వేశాయి. కానీ, సుమీత్ రెడ్డి-మను అత్రి 18-21, 11-21తో మలేసియాకు చెందిన గో సె ఫెయ్-నర్ ఇజుద్దిన్ జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కిరెడ్డి-ధ్రువ్ జోడీ 14-21, 21-17, 21-18తో హూ పాంగ్ యీ చియా(మలేసియా) జంటపై కష్టపడి గెలిచింది.
ఇక సింధు.. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ గెలవడంపై దృష్టి పెట్టాలని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకోన్ సూచించాడు. భారత్ నుంచి ప్రకాశ్ తొలిసారి ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించాడు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలుగు షట్లర్ సింధు గురించి మాట్లాడాడు. 'సింధు స్థానంలో నేనుంటే ఆల్ ఇంగ్లండ్ గెలవడమే టార్గెట్‌గా పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఆ ఒక్కటి మినహా అన్ని టోర్నీల్లోనూ ఆమె గెలిచింది. అందువల్ల ఆ టైటిల్‌పై ఫోకస్ పెట్టాలి. ఓ ప్లాన్ ప్రకారం సిద్దమవ్వాలి. సింధు, సైనా స్థాయి ప్లేయర్లు మహిళల సింగిల్స్‌లో ప్రస్తుతం లేరు'అని ప్రకాశ్ అన్నాడు.