కాల్గరీ: కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో సింధుకు వాకోవర్ లభించింది. జపాన్ స్టార్ నత్సుకి నిదైర గాయంతో తప్పుకోవడంతో మ్యాచ్ ఆడకుండానే సింధు విజేతగా నిలిచింది.
ఇక బుధవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21-16, 21-9తో తాలియా (కెనడా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే. 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ సింధు ఆధిపత్యంతో ఏకపక్షంగా ముగిసింది. స్థానిక ప్లేయర్ తాలియా ఏ దశలోనూ సింధుకి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

డ్రాప్ షాట్లు, సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ లతో సింధు విరుచుకుపడగా.. ప్రత్యర్థి తేలిపోయింది. కాగా, రుత్విక శివాని 12-21, 3-21తో సుపనిడా కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. వరుస గేమ్‌ల్లో చిత్తయ్యింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ సంచలన విజయాన్నందుకున్నాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)కు లక్ష్యసేన్ ఊహించని షాకిచ్చాడు.
తొలి రౌండ్లో 19వ ర్యాంకర్ లక్ష్యసేన్ 21-18, 21-15తో రెండో సీడ్ కున్లావత్‌ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. కున్లావుత్‌పై తన గెలుపోటముల రికార్డును 4-5తో మెరుగుపరుచుకున్నాడు. రెండు గేమ్‌ల్లో కున్లావత్‌కు లక్ష్యసేన్ చుక్కలు చూపించాడు. మెరుగైన ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాడు.
తిరుగులేని బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థిని ఓడించి మరీ ప్రీక్వార్టర్‌కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో వైగర్‌తో లక్ష్యసేన్ పోటీపడనున్నాడు. అతనిపై లక్ష్యసేన్‌కు 3-0తో మెరుగైన రికార్డు ఉంది. మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 12-21, 17-21తో వైగర్ కోలో (బ్రెజిల్) చేతిలో ఓటమి పాలయ్యాడు.

ఈ సీజన్‌లో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సింధు.. బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి 15వ ర్యాంక్‌లో నిలిచింది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సింధు అనంతరం గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా సత్తా చాటలేకపోతుంది. లయను దొరకబుచ్చుకోవడంలో ఇబ్బంది పడుతోంది. వరుస టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే ఓటమిపాలైంది.