కొపెన్‌హెగెన్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. అసాధారణ ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ ప్రణయ్ 21-18, 15-21, 21-19 తేడాతో ఏడో సీడ్, ఇండోనేషియా ప్లేయర్ కీన్ యూపై విజయం సాధించాడు.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి లోకీన్ నుంచి ప్రణయ్‌కి గట్టిపోటీ ఎదురైంది. ప్రత్యర్థి తప్పిదాలను అందిపుచ్చుకున్న ప్రణయ్ 21-18తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో పుంజుకున్న ఇండోనేషియా షట్లర్.. ప్రణయ్‌కు ఎక్కువగా అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌లో దూకుడుగా ఆడిన ప్రణయ్ బ్రేక్‌కు ముందు 11-4తో నిలిచాడు. అనంతరం లోకీన్ అసాధారణ ప్రదర్శనతో వరుస పాయింట్లు సాధించి 16-16తో స్కోరు సమం చేశాడు.

ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. స్కోరు 19-19 వద్ద ఒత్తిడిని అధిగమించిన ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. మరో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పదకొండో సీడ్ 14-21, 21-16, 13-21తో మూడో సీడ్ కున్లావత్ విదిత్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడాడు.
భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతేడాది బ్రాంజ్ మెడల్‌తో సత్తాచాటిన ఈ భారత ద్వయం.. ప్రిక్వార్టర్స్‌లో 21-15, 19-21, 21-9తో లియో కార్నాండో- డానియెల్ మార్టిన్ (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. హోరాహోరీగా సాగిన పోరులో సాత్విక్- చిరాగ్ జోడీ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది.
తొలి రెండు గేమ్‌లు నువ్వానేనా అన్నట్లు సాగడంతో ఇరు జోడీలు సమవుజ్జీలుగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత జోడీ దుమ్మురేపింది. ప్రత్యర్థి జంటకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. 7-6తో ఆధిక్యం సాధించిన సాత్విక్- చిరాగ్ జోడీ చివరి వరకు అదే జోరును కొనసాగించి
21-9తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా జాలీ జోడీ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. గాయత్రి జోడీ 14-21, 9-21తో టాప్ సీడ్ చెన్ కింగ్- జియా ఫాన్ (చైనా) జోడీ చేతిలో ఓటమిపాలైంది.