సిడ్నీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. గత కొద్ది రోజులుగా పేలవ ప్రదర్శనతో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పడుతున్న భారత అగ్రశ్రేణి షట్లర్.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు 21-18, 21-13 తేడాతో భారత్‌కే చెందిన అష్మితా చాలిహాపై గెలుపొందింది. తన కంటే జూనియర్ అయిన అష్మితాపై పీవీ సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రేండు గేమ్స్‌ను వరుసగా గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో కాస్త పోరాడిన అష్మితా.. రెండో రౌండ్‌లో సింధు స్మాష్ లైన్ గేమ్‌కు చేతులెత్తేసింది.

పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ 21-18, 16-21, 21-15 తేడాతో హాంగ్ కాంగ్ షట్లర్ లీ చూక్ యీను ఓడించాడు. ఈ విజయం కోసం ప్రణయ్ చెమటోడ్చాడు. హంగాంగ్ ప్లేయర్ గట్టి పోటీ ఇవ్వడంతో మూడు గేమ్స్ పాటు ప్రణయ్ కష్టపడ్డాడు. రెండో గేమ్‌లో ఓడినా.. మూడో గేమ్‌లో పుంజుకొని హాంగ్ కాంగ్ ప్లేయర్‌ను మట్టికరిపించాడు.
మరో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-18, 21-7 తేడాతో జపాన్ ప్లేయర్ కేంటా నిషిమోటోను చిత్తు చేసాడు. శ్రీకాంత్ ఆడుతూ పాడుతూ ఈ గేమ్ గెలిచాడు.
మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్‌లు, భారత డబుల్స్ షట్లర్లు పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ శుభారంభం చేశారు. 17వ ర్యాంకర్ గాయత్రి-ట్రీసా 21-16, 21-17 తేడాతో 29వ ర్యాంకర్ కేథరిన్ చోయి-జోసెఫైన్‌వు(కెనడా)జోడీని మట్టికరిపించారు.
మరో మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట 12-21, 21-14, 17-21 తేడాతో షెబ్రియానా కుసుమ-అమేలియా ప్రతివి(ఇండోనేషియా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. సిక్కిరెడ్డి-ఆరతి ద్వయం 14-21, 17-21 తేడాతో తైవాన్‌కు చెందిన సు యిన్-లీ చిహ్ చెన్ చేతిలో ఓడింది.