ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకునేందుకు జకోవిచ్ మరో అడుగు ముందుకు వేసాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జకోవిచ్ 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో మూడో సీడ్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్‌ను చిత్తు చేశాడు. ఈ విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. 11వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు.
మరోవైపు తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించాలని భావించిన అల్కరాజ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. 3 గంటల 37 నిమిషాల పాటు సాగిన ఈ క్వార్టర్ ఫైనల్లో తనకు అలవాటైన రీతిలోనే జకోవిచ్.. తొలి సెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత అసలు సిసలు ఆటతో అల్కరాజ్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా మూడు సెట్లను గెలుచుకొని గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో నోవాక్ జకోవిచ్ 5 ఏస్‌లు, 33 విన్నర్లు కొట్టగా.. అల్కరాజ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రోఫెషనల్ టెన్నిస్‌లో జకోవిచ్, అల్కరాజ్ ఇప్పటి వరకు 8 సార్లు తలపడగా.. ఐదు సార్లు సెర్బియా స్టారే విజయం సాధించాడు. అల్కరాజ్ మాత్రం మూడు సార్లు గెలిచాడు.
సెమీఫైనల్లో జకోవిచ్ జర్మన్ ప్లేయర్, రెండో సీడ్ అలెగ్జండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. శుక్రవారం ఈ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. గతేడాది జకోవిచ్ ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా గెలవలేదు. ఈ క్రమంలోనే తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు.