All England Open 2022: పాపం లక్ష్యసేన్.. ఫైనల్లో ఓటమి!

బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మరో టైటిల్ నెగ్గాలన్న భారత రెండు దశాబ్దాల కల ఈసారి కూడా నెరవేరలేదు. సంచలన ఆటతో ఆశలు రేపిన యువ ఆటగాడు లక్ష్యసేన్ లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు వచ్చిన లక్ష్యసేన్.. టైటిల్ ఫైట్‌లో వరల్డ్ నంబర్ వన్ విక్టర్ అక్సెల్సెన్ అడ్డు దాటలేకపోయాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ విక్టర్ 21-10, 21-15తో వరుస గేమ్స్‌లో లక్ష్యసేన్‌ను ఓడించి టైటిల్ నెగ్గాడు.

ఒత్తిడి జయించలేక...
సెమీస్‌లో డిఫెండింగ్ చాంప్ లీజికి చెక్ పెట్టిన సేన్.. 53 నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో మాత్రం ఒత్తిడిని జయించలేక చేతులెత్తేశాడు. దాంతో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలనుకున్న లక్ష్యసేన్ కల చెదిరింది. వరుసగా నాలుగో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన విక్టర్ చాంపియన్ ఆటతీరుతో మెప్పించాడు. ఫైనల్లో లక్ష్య సేన్ పై విక్టర్ అదే జోరును కొనసాగించాడు. రెండో గేమ్ చివర్లో లక్ష్య కాస్త పుంజుకున్నా.. మ్యాచ్ ఆసాంతం అక్సెల్సెన్‌దే ఆధిపత్యం.

వరుస గేమ్‌ల్లో..
తొలి గేమ్ మొదట్లోనే 0-6తో వెనుకబడి ఒత్తిడికి గురైన లక్ష్య.. ఆ తర్వాత పుంజుకోలేకపోయాడు. విరామానికి 11-2తో ఉన్న అక్సెల్సెన్ అదే ఊపులో అలవోకగా తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్య కాస్త పుంజుకున్నాడు. ఆరంభంలో 4-4తో సమంగా నిలిచాడు.
ఓ దశలో 5-8తో ఉన్నాడు. కానీ జోరు కొనసాగిస్తూ అక్సెల్సెన్ విరామానికి 11-5తో నిలిచాడు. ఆ తర్వాత 20-12తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి ఎనిమిది ఛాంపియన్‌షిప్ పాయింట్లపై నిలిచాడు. అతడి విజయం లాంఛనమే అనుకున్న దశలో లక్ష్య కాస్త ప్రతిఘటించాడు. వరుసగా మూడు పాయింట్లు సాధించి ప్రత్యర్థిని కాస్త ఒత్తిడికి గురిచేశాడు. కానీ ఆ పోరాటం ఏమాత్రం సరిపోలేదు. టైటిల్ అక్సెల్సెన్ సొంతమైంది. అతడు ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలవడం ఇది రెండోసారి.

మహిళల చాంపియన్ యమగూచి..
జపాన్‌కు చెందిన అకానె యమగూచి మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఆమె 21-15, 21-15తో ఆన్ సియంగ్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. మరోవైపు సంచలన ప్రదర్శనతో మహిళల డబుల్స్‌లో సెమీస్ చేరిన గాయత్రి గోపీచంద్ పుల్లెల-ట్రీసా జాలీ జోడీ.. ఫైనల్ చేరలేకపోయింది. సెమీస్‌లో ఈ జోడీ 17-21, 16-21తో జాంగ్ షియాన్-జాంగ్ యు (చైనా)ల చేతుల్లో ఓడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications