ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ టోర్నీలో విషాదం చోటు చేసుకుంది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో చైనా షట్లర్ జాంగ్ జిజీ(17) మ్యాచ్ ఆడుతూనే గుండెపోటుకు గురై మరణించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ కజుమా కవానోతో జాంగ్ జిజీ పోటీ పడ్డాడు.
మ్యాచ్ జరుగుతుండగానే ఒక్కసారిగా గుండెపోటుకు గురైన అతను కోర్టులోనే కుప్పకూలాడు. అయితే జాంగ్ జిజీ గుండెపోటును మ్యాచ్ రిఫరీ పసిగట్టలేకపోయాడు. దాంతో ఫిజియోలు ఆలస్యంగా వచ్చిన అతన్ని పరిశీలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడాన్ని గమనించి
టోర్నీ నిర్వాహకుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కానీ జాంగ్ జీజీ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.

జాంగ్ జిజీ గతేడాదే చైనా జూనియర్ జట్టులో చేరాడని అతడి సహచరులు మీడియాకు తెలిపారు. 17 ఏళ్ల జాంగ్ జిజీ ఆకస్మకిక మరణంతో చైనా బ్యాడ్మింటన్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
17 ఏళ్ల వయసులోనే జిజీ గుండెపోటుతో మరణించడం విచారకరమని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించింది. ప్రతిభావంతమైన ప్లేయర్ ను కోల్పోయామంటూ ఆసియా, ఇండోనేసియా బ్యాడ్మింటన్ అసోసియేషన్స్ ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేసాయి.