వరుసగా 23వ మ్యాచ్‌లో విజయం.. బాసెల్‌ ఫైనల్స్‌లో ఫెదరర్‌!!

బాసెల్‌: స్విస్ స్టార్, టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ అద్భుత ప్రదర్శనతో బాసెల్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. స్విస్‌ ఇండోర్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఫెదరర్‌ గ్రీక్‌ సంచలనం, మూడో సీడ్‌ స్టిఫానొస్‌ సిట్సిపాస్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించాడు. సిట్సిపాస్‌ వరుస సెట్‌లలో ఫెదరర్‌ దూకుడు ముందు నిలవలేకపోయాడు. బాసెల్‌లో వరుసగా 23వ మ్యాచ్‌లో ఫెదరర్‌ గెలిచాడు. ఫెదరర్‌ ఈ సీజన్‌లో 50 విజయాన్ని అందుకొన్నాడు. 16 సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు.

ఆదివారం జరిగే ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ డి మినార్‌తో రోజర్‌ ఫెదరర్‌ తలపడనున్నాడు. ఫైనల్స్‌లో ఫెదరర్ గెలవడం సులువే. స్విస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే తొమ్మిది టైటిల్స్‌ సాధించిన ఫెదరర్‌.. ఈ మ్యాచ్‌ కూడా గెలిస్తే పది టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంటాడు. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్విస్ ఇండోర్స్ 2019 ఫైనల్ మ్యాచ్ సోనీ, ఇఎస్‌పిఎన్, సోనీ ఇఎస్‌పిఎన్ హెచ్‌డిలలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. లైవ్ స్ట్రీమ్ టెన్నిస్ టీవీలో కూడా అందుబాటులో ఉంది.

మ్యాచ్ అనంతరం రోజర్‌ ఫెదరర్‌ మాట్లాడుతూ... 'అభిమానుల మద్దతు వలనే విజయాలు సాధిస్తున్నా. అందరికి ధన్యవాదాలు. ఈ మ్యాచ్ గెలవడానికి స్టిఫానోస్‌పై దూకుడుగా ఆడాల్సి వచ్చింది. స్వదేశంలో ఆడటం కలిసివచ్చింది. ఫైనల్‌కు చేరడం ఉత్సాహంగా ఉంది. కచ్చితంగా టైటిల్ సాధిస్తా' అని 38 ఏళ్ల ఫెదరర్‌ ధీమా వ్యక్తం చేసాడు. మరోవైపు 1997లో మార్క్‌ ఫిలిప్పోసిస్‌ తరువాత బాసెల్‌ ఫైనల్‌కి చేరిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా అలెక్స్‌ నిలిచాడు.

స్పెయిన్‌ బుల్, 19 సార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్ రఫెల్‌ నాదల్‌ ఇటీవలే ఓ ఇంటి వాడయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ షిస్కా పెరిల్లోను నాదల్‌ వివాహం చేసుకున్నాడు. 14 ఏళ్లుగా డేటింగ్‌లో రఫెల్‌ నాదల్‌ (33), షిస్కా పెరిల్లో (31)లు ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్పెయిన్‌ దీవుల్లోని మలోర్కాలో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి దాదాపు 350 మందికిపైగా సన్నిహితులు, అతిథులు హాజరయ్యారు. అయితే ఫెదరర్‌ మాత్రం పెళ్లికి హాజరు కాలేదు. స్విస్‌ ఇండోర్‌ బాసిల్‌ టైటిల్‌ నిలబెట్టుకునేందుకు ఫెదరర్‌ పెళ్లికి హాజరు కాలేదు.

READ SOURCE