టాప్‌-2 జట్ల రసవత్తర మధ్య పోరు.. ఢిల్లీపై బెంగాల్‌ విజయం

పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో టాప్‌-2 జట్ల మధ్య పోరులో బెంగాల్‌ వారియర్స్‌ పైచేయి సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 42-33తో దబాంగ్‌ ఢిల్లీపై విజయం సాధించింది. వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 13 పాయింట్లు సాధించగా.. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ (15 పాయింట్లు) మరోసారి సూపర్-10తో మెరిశాడు. మణిందర్‌కు ఈ సీజన్‌లో ఇది పదో సూపర్-10 కావడం విశేషం. ఇక నవీన్‌కు ఇది వరుసగా 18వ సూపర్-10 కావడం మరో విశేషం.

మ్యాచ్ ఆరంభంలో 3-1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఢిల్లీ ఆ తర్వాత వెనుకబడిపోయింది. మణిందర్‌, సుఖేష్ హెగ్డే చెలరేగడంతో వారియర్స్‌ దూసుకుపోయింది. మరోవైపు రింకు నర్వాల్ రెండు టాకిల్స్ కూడా చేయడంతో ఢిల్లీ ఆలౌట్ అయింది. అనంతరం మరోసారి ఆలౌట్ చేసి 25-14తో వారియర్స్ మొదటి భాగాన్ని ముగించింది. రెండో భాగంలో నవీన్ రైడ్ పాయింట్లు సాధించినా కూడా ఢిల్లీకి వారియర్స్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వారియర్స్ అదే ఊపు మ్యాచ్ చివరి వరకు కొనసాగించి విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో వారియర్స్ పాయింట్లు మెరుగు పర్చుకొని అగ్రస్థానానికి మరింత చేరువైంది. ప్రస్తుతం 20 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 82 పాయింట్లతో టాప్‌లో ఉంది. 20 మ్యాచ్‌లు ఆడిన బెంగాల్ 78 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. ఢిల్లీ, వారియర్స్ జట్లతో పాటు హర్యానా స్టీలర్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 36-32తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీ పడ్డాయి. ముంబా రైడర్లు చెలరేగడంతో తొలి అర్ధ భాగాన్ని 15-11తో ముగించింది. విరామం అనంతరం అజిత్ కుమార్ రాణించడంతో తలైవాస్‌ పుంజుకుంది. మరోవైపు సందీప్ నర్వాల్, అభిషేక్ సింగ్ కూడా పాయింట్లు తేవడంతో ముంబా ఆధిక్యాన్ని కొనసాగిస్తూ విజయాన్ని అందుకుంది.

READ SOURCE