సెమీస్‌ ఆశలకు గండి.. బీసీసీఐపై మండిపడ్డ యువీ, భజ్జీ!!

బెంగళూరు: భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌, వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌లు బీసీసీఐపై మండిపడ్డారు. ఈ ఇద్దరు పంజాబ్ ఆటగాళ్లు మండిపడడానికి ఓ కారణం కారణం ఉంది. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్‌, తమిళనాడు జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. నిబంధనల ప్రకారం లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు అందుకున్న తమిళనాడు సెమీస్‌ చేరింది. దీంతో పంజాబ్‌ సెమీస్‌ ఆశలకు గండిపడింది.

టోర్నీలో సెమీస్‌ స్థానం కోసం జరిగే కీలక మ్యాచ్‌కు రిజర్వ్‌డే లేకపోవడంపై యువీ, భజ్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. భజ్జీ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'చెత్త నిబంధన. ఇలాంటి టోర్నీలలో కీలక మ్యాచ్‌లకు రిజర్వ్‌డేను ఎందుకు కేటాయించకూడదు. బీసీసీఐ తన నిబంధలనలను ఓ సారి పరిశీలించాలి. మార్పులు చేయాలి' అని రాసుకొచ్చాడు.

'విజయ్‌హజారే ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. రిజర్వ్‌డే లేని కారణంగా పంజాబ్‌ సెమీస్‌కు వెళ్లలేదు. టోర్నీలో ఎందుకు రిజర్వ్‌డే కేటాయించలేదో అర్థం కావడం లేదు?. దేశవాళీ టోర్నీ అని రిజర్వ్‌డే ఆడించలేదా?' అని యువీ ట్విట్టర్లో బీసీసీఐని ప్రశ్నించాడు.

పంజాబ్‌, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు 39 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన దశలో వరణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. వీజేడీ పద్ధతి ద్వారా పంజాబ్‌ లక్ష్యాన్ని 195 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో పంజాబ్‌ 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసిన సమయంలో మరోసారి వరణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఆట సాధ్యపడలేదు. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. లీగ్‌లో తమిళనాడు (9) పంజాబ్‌ (5) కంటే ఎక్కువ విజయాలు నమోదు చేయడంతో సెమీస్‌కు చేరింది.

మరోవైపు ముంబై, ఛత్తీస్‌గఢ్‌ మధ్య జరగాల్సిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన ఛత్తీస్‌గడ్‌ సెమీస్‌కు చేరింది. రిజర్వ్‌డే లేకపోవడంతో లీగ్‌లో రెండు ప్రధాన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. రిజర్వ్‌డే లేకపోవడం పట్ల క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

READ SOURCE