India vs Bangladesh: కోహ్లీని ఒప్పించడానికి 3 సెకన్లు పట్టింది: గంగూలీ

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో డేనైట్‌ టెస్టు కోసం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఒప్పించేందుకు కేవలం 3 సెకన్లు పట్టింది అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. గతేడాది ఆస్ట్రేలియాతో డేనైట్‌ టెస్టులను బీసీసీఐ ఎందుకు వ్యతిరేకించిందో కారణాలు తెలియదని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా డేనైట్‌ టెస్టుల విషయంలో వెనుకంజ వేస్తున్న భారత జట్టును.. బోర్డు కొత్త బాస్‌గా వచ్చిన వారం రోజుల్లోనే గంగూలీ ఆడించేలా చేశాడు. ఈనెల 22 నుంచి ఈడెన్‌లో రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్న విషయం తెలిసిందే.

3సెకన్లలో ఓకే చెప్పాడు

ఐదుసార్లు 'అంపైర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు దక్కించుకున్న సైమన్ టఫుల్ రాసిన 'ఫైండింగ్ ది గ్యాప్స్' పుస్తకావిష్కరణ శనివారం కోల్‌కతాలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గంగూలీ మాట్లాడారు. 'గతంలో భారత్‌ ఈ తరహా మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదో నాకు తెలీదు. అడిలైడ్‌లో కూడా ఎందుకు అంగీకరించలేదో నాకైతే అవగాహన లేదు. కోహ్లీతో గంటపాటు సమావేశం అయ్యాను. తొలి ప్రశ్న డేనైట్‌ టెస్టు గురించే అడిగా. కేవలం మూడు సెకన్లలోనే సమాధానమిస్తూ ముందుకెళదాం అన్నాడు' అని దాదా తెలిపారు.

పూర్వవైభం వస్తుంది

'డేనైట్‌ టెస్టులపై కోహ్లీ ఇష్టంతో ఉండటం గమనించా. ఖాళీ స్టాండ్లతో టెస్టు క్రికెట్‌ ముందుకు తీసుకెళ్లలేమని కోహ్లీ గ్రహించాడు' అని దాదా పేర్కొన్నారు. '20 మ్యాచ్‌కు ప్రతి స్టాండ్‌ కిక్కిరిసిపోతుందని నాకు తెలుసు. సరైన నిర్వహణ ఉంటే టెస్టు మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అధిక సంఖ్యలో రప్పించవచ్చు. డే అండ్ నైట్ టెస్టుల వల్ల సంప్రదాయ క్రికెట్‌కు పూర్వవైభం వస్తుంది' అని దాదా ధీమా వ్యక్తం చేశారు.

జనాలకు తగినట్టు మార్పులు చేయాలి

'ఇప్పుడు ప్రజల జీవితాలు పూర్తిగా మారాయి. ఆఫీస్‌లు వదిలేసి రాలేరు. వారికి తగ్గట్టు మనమే మార్పులు చేసుకోవాలి. కంఫర్ట్‌ జోన్‌ను వదిలేస్తే.. మార్పు మొదలవుతుంది. గులాబి బంతి తిరిగి జనాలను ఆకర్షిస్తుందనే అనుకుంటున్నా. నా వందో టెస్టు బాక్సిండ్‌ డే నాడు మెల్‌బోర్న్‌లో ఆడాను. కెరీర్‌లో అలాంటి స్థితిలో ఉండాలంటే అదృష్టం ఉండాలి. ఆ టెస్టు మ్యాచ్‌ తొలిరోజు దాదాపు 70వేల మందితో స్టాండ్లు నిండిపోయాయి. యాషెస్‌లోనూ అంతే' అని గంగూలీ చెప్పుకొచ్చారు.

ఈడెన్‌లో డేనైట్‌ టెస్టు

భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. 14 నుంచి టెస్ట్ ప్రారంభం కానుండగా.. 22 నుంచి ఈడెన్‌లో రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగనుంది.

READ SOURCE