Virat Kohli's DRS blunders: టెస్టు బ్యాట్స్‌మన్‌గా వరుసగా 9వసారి విఫలం!

హైదరాబాద్: డెసిషన్ రివ్యూ సిస్టమ్(DRS)ను వినియోగించుకోవడంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో తన ఎల్బీ నిర్ణయంపై రివ్యూ కోరిన కోహ్లీ.... చివరకు ఫీల్డ్‌ అంపైర్‌ కాల్‌తో పెవిలియన్‌కు చేరాడు.

టెస్టుల్లో ఓ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ వరుసగా 9వసారి తన డీఆర్ఎస్ కాల్‌‌లో విఫలమయ్యాడు. చివరగా నవంబర్ 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా డీఆర్ఎస్ నిర్ణయం తారుమారైంది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీ(12) ఔటయ్యాడు.

అన్రిచ్ నార్జే వేసిన 16 ఓవర్‌ మూడో బంతిని విరాట్ కోహ్లీ భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ బంతి కాస్తా మిస్ కావడంతో కోహ్లీ ప్యాడ్లను తాకింది. దీంతో సఫారీ ఫీల్డర్లు అప్పీల్ చేయగా.... ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మతో చర్చించి కోహ్లీ రివ్యూకు వెళ్లాడు.

రివ్యూలో బంతి

ఆ రివ్యూలో బంతి ఎటువంటి ఇన్‌సైడ్‌ను తీసుకోలేదు. దీంతో బంతి వికెట్లవైపు వెళుతుందా అనే కోణాన్ని పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌... చివరకు నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేశాడు. దీంతో ఫీల్డ్ అంఫైర్ తొలుత తాను ఔట్ ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. దీంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

లంచ్ విరామానికి

లంచ్ విరామానికి 23 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(38), రహానే(11) పరుగులతో ఉన్నారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడకు రెండు, అన్రిచ్ నోర్ఝికు ఒక వికెట్ లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది.

తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు

తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరితే, రెండో వికెట్‌గా ఛటేశ్వర్ పుజారా పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 16 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రబడా వేసిన ఐదో ఓవర్‌ ఆఖరి బంతికి అగర్వాల్‌(10) ఔటయ్యాడు.

రెండు వికెట్లు తీసిన రబాడ

రబాడ వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్‌ థర్డ్‌ స్లిప్‌లో ఉన్న డీన్ ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌కు చేరాడు. ఆ తర్వాత ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన పుజారా కూడా నిరాశపరిచాడు. రబాడ వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతికి తృటిలో ఎల్బీడబ్యూ అయ్యే అవకాశం తప్పించుకున్న పుజారా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి ఎల్బీగానే ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది బంతులు ఆడిన పుజారా డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్‌ పంపాడు.

READ SOURCE