వరుసగా రెండో ఏడాది.. టాప్‌-3లోనే కోహ్లీ, రోహిత్‌, ధోనీ!!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. కెరీర్ ఆరంభం నుండి ఫామ్ కోల్పోకుండా పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. దీంతో రోజురోజుకి కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. అలాగే ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఓ రేంజులో ఉంది. తాజాగా ఓ ఆన్‌లైన్‌ సంస్థ నివేదిక ప్రకారం ఇది స్పష్టంగా తెలిసింది.

వరుసగా రెండో ఏడాది:

2019 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలంలో అభిమానులు అత్యధిక సార్లు శోధించిన ఆటగాళ్ల జాబితాను తాజాగా ఓ ఆన్‌లైన్‌ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు టాప్‌-3లో నిలిచారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో కోహ్లీ, రోహిత్‌, ధోనీలకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఏ రేంజులో ఉందో మరోసారి అర్ధమయింది. అయితే ఇక్కడ ఈ ముగ్గురు వరుసగా రెండో ఏడాది టాప్‌-3లోనే నిలవడం విశేషం.

అగ్ర స్థానంలో టీమిండియా:

విరాట్ కోహ్లీ గురించి అంతర్జాలంలో శోధించిన వారి సంఖ్య నెలకి సగటున 2 మిలియన్లుగా ఉందట. అలాగే రోహిత్‌ శర్మ, ఎంఎస్ ధోనీలు సైతం నెలకి సగటున పది లక్షలకు పైగా దాటారు. గతేడాదితో పోలిస్తే.. 2019లో వీరి గురించి శోధించిన వారి సంఖ్య 1.5 రెట్లు పెరగడం గమనార్హం. ఇక అత్యధిక సార్లు శోధించిన జట్టుగా 2019లో టీమిండియా అగ్ర స్థానంలో నిలిచింది. గతేడాది ఇంగ్లాండ్‌ తొలి స్థానాన్ని పొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ ఈ రెండేళ్లలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

భూటాన్‌లో కోహ్లీ:

విరాట్‌ కోహ్లీ మంగళవారం 31వ ఏట ప్రవేశించాడు. బంగ్లాతో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అంతేకాదు భూటాన్ టూర్ గురించి వివ‌రించింది. ట్రెక్కింగ్ స‌మ‌యంలో ఓ ఫ్యామిలీతో గ‌డిపిన విష‌యాన్ని వెల్ల‌డించింది. మా సెల‌బ్రిటీ స్టేట‌స్ గురించి వారికి తెలియ‌క‌పోయినా.. వారు మాత్రం మాకు మంచి ఆతిథ్యం ఇచ్చార‌ని అనుష్క త‌న ఇన్‌స్టాలో పేర్కొన్న‌ది.

సారధిగా విఫలం:

ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక బంగ్లాతో సిరీస్ నుంచి విరాట్ తప్పుకోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు చేపట్టాడు. అయితే ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20 సారధిగా రోహిత్ విఫలమయ్యాడు.

READ SOURCE