వైరల్ వీడియో.. అచ్చం హర్బజన్‌లా బౌలింగ్ చేసిన బాలిక!!

ముంబై: సోషల్ మీడియా వచ్చినప్పటినుండి అభిమానులు ఆటగాళ్లను అనుకరించడడం మామూలుగా మారింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ బుడ్డోడు భారత స్టార్ పేసర్ జస్ప్రిత్‌ బుమ్రాలా బౌలింగ్‌ చేసి వార్తల్లో నిలిచాడు. శ్రీలంకకు చెందిన సీనియర్ ఆటగాడు లసిత్‌ మలింగా శైలిలో 17 ఏళ్ల మతీషా పతిరాణా బౌలింగ్‌ చేయడం చూశాం. తాజాగా ఓ బాలిక టీమిండియా వెటరన్‌ ఆఫ్ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌ శైలిని అనుకరిస్తూ బౌలింగ్‌ చేసింది. బుమ్రా, మలింగాల బౌలింగ్‌ శైలిని అబ్బాయిలు అనుకరిస్తే.. హర్బజన్‌ శైలిని అమ్మాయి చేయడం విశేషం.

మిగతా బౌలర్ల కన్నా హర్బజన్‌ బౌలింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది. హర్బజన్‌ బౌలింగ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ లెంగ్త్‌ను తీసుకోడు. బంతిని వేసేటప్పుడు రెండు చేతులను గాల్లోనే తిప్పి బౌలింగ్ చేస్తాడు. అచ్చం హర్బజన్‌లానే ఓ బాలిక బౌలింగ్ చేసి ఔరా అనిపించింది. దీనికి సంబందించిన వీడియోను భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసాడు.

'ఈ అమ్మాయిని చూస్తేంటే నిన్నే (హర్భజన్‌ సింగ్‌) ఆదర్శంగా తీసుకున్నట్టు ఉంది. భవిష్యత్‌లో దేశానికి మరో మంచి స్పిన్నర్‌ దొరికే అవకాశం ఉంది' అని ఆకాశ్‌ చోప్రా రాసుకొచ్చాడు. ప్రస్తుతం చోప్రా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. 'మరో హర్భజన్‌ సింగ్‌' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'సూపర్ బౌలింగ్' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు.

ప్రస్తుతం హర్భజన్‌ సింగ్, ఆకాశ్‌ చోప్రాలు క్రికెట్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహిరిస్తున్నారు. ఇటీవలే ముగిసిన భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా ఇద్దరు కలిసి వ్యాఖ్యానం చేశారు. రాంచీ టెస్టు సందర్భంగా జాంటీ రోడ్స్‌తో హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంచీ టెస్టులో జాంటీ రోడ్స్‌ బ్యాటింగ్‌కు దిగితే దక్షిణాఫ్రికా భారీ పరుగులు సాధిస్తుంది అని సరదా కామెంట్లు చేసాడు. అయితే ఈ వ్యాఖ్యలపై జాంటీ రోడ్స్‌ స్పందించలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుఇన్న విషయం తెలిసిందే.

READ SOURCE