మూడేళ్ళ తర్వాత డకౌటైయిన స్టీవ్ స్మిత్!!(వీడియో)

హైదరాబాద్: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ డకౌట్ అయ్యాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న స్మిత్ మూడేళ్ల తర్వాత డకౌట్ అయ్యాడు. అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం కాదు. స్మిత్ డకౌట్ అయింది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో. నవంబర్ 2016 నుండి స్మిత్ డకౌట్ అవ్వడం ఇదే మొదటిసారి.

ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో నాలుగు టెస్టుల్లో స్టీవ్‌ స్మిత్‌ 774 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో పరుగుల ప్రవాహం పారించాడు. యాషెస్ అనంతరం ఖాళీ సమయాన్ని స్మిత్ ఉపయోగించుకుంటున్నాడు. గురువారం షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా న్యూ సౌత్ వేల్స్ తరఫున బ్యాటింగ్ చేస్తున్న స్మిత్.. తాను ఎదుర్కొన్న ఐదవ బంతికి డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. క్వీన్స్ లాండ్ పేసర్ కామెరాన్ గానన్.. స్మిత్‌ను ఔట్ చేసాడు. దీంతో నవంబర్ 2016 నుండి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో స్మిత్ పరుగులేమి చేయకుండా వెనుదిరగడం ఇదే మొదటసారి.

స్మిత్‌ మూడేళ్ల తర్వాత టీ20ల్లో చోటు దక్కించుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో పరుగుల ప్రవాహం పారించిన స్మిత్‌పై నమ్మకం ఉంచి ఆసీస్ జాయమాన్యం అతడికి టీ20 జట్టులో చోటు కల్పించింది. శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లతో త్వరలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌లకు స్మిత్‌ను ఎంపిక చేస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో అక్టోబర్‌ 27వ తేదీన శ్రీలంకతో తొలి టీ20 ఆరంభం కానుంది. లంకేయులతో టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత టాప్‌ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్‌తో ఆసీస్‌ తలపడనుంది. ఈ టీ20 సిరీస్‌లకు అరోన్‌ ఫించ్‌ ఆసీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

స్మిత్ యాషెస్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో 937 పాయింట్లతో నంబర్‌ వన్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. 903 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లీని స్మిత్ అధిగమించాడు. అయితే తాజాగా కోహ్లీ స్మిత్ టెస్టు సెంచరీల రికార్డుని సమం చేశాడు.

READ SOURCE