Australia vs Sri Lanka: టీ20లో లంక బౌలర్ చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 75 పరుగులు

అడిలైడ్‌: ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌, హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ పరుగుల సునామీ సృష్టించడంతో శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వార్నర్‌ దూకుడైన ఆటతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ (100; 56 బంతుల్లో 10x4,4x6)ని తన బర్త్‌కి తనకే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. ఆరోన్‌ ఫించ్‌ (64; 36 బంతుల్లో 8x4, 3x6), మ్యాక్స్‌వెల్‌ (62; 28 బంతుల్లో 7x4, 3x6) కూడా వేగంగా ఆడుతూ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

టీ20లో చెత్త రికార్డు:

ఫించ్‌, వార్నర్‌, మ్యాక్స్‌వెల్ ఊచకోత కోయడంతో శ్రీలంక పేసర్‌ కసున్ రజిత తన ఖాతాలో పేలవమైన రికార్డు వేసుకున్నాడు. రజిత వేసిన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టర్కీ బౌలర్ తునాహన్ తురాన్ పేరిట ఉండేది. గత ఆగస్టులో చెక్ రిపబ్లిక్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు ఇచ్చాడు.

13 బంతులు బౌండరీకి:

తొలి టీ20లో రజిత నాలుగు ఓవర్లలలో 13 బంతులు బౌండరీకి వెళ్లాయి. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్ ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదారు. రజిత తన తొలి ఓవర్‌లో 11, రెండో ఓవర్‌లో 21, మూడో ఓవర్‌లో 25, నాలుగో ఓవర్‌లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఫించ్‌, వార్నర్‌,మ్యాక్స్‌వెల్ ముగ్గురూ రజిత బౌలింగ్‌లో సిక్సులు బాదారు.

వార్నర్‌ విధ్వంసం:

శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఫించ్, వార్నర్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరు మొదటి వికెట్‌కి 122 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ తర్వాత ఫింట్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కి వచ్చిన మ్యాక్స్‌వెల్ కూడా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. వార్నర్ సెంచరీ.. మ్యాక్స్‌వెల్ అర్థ శతకాలు సాధించడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది.

20 ఓవర్లలలో 99 పరుగులే:

234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో షనక (17) టాప్‌ స్కోరర్‌. ఆసీస్‌ బౌలర్లలో జంపా మూడు.. స్టార్క్‌, కమిన్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు. శతకంతో చెలరేగిన డేవిడ్‌ వార్నర్‌ 'ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు. రెండో టీ20 మ్యాచ్‌ ఈనెల 30న గబ్బాలో జరగనుంది.

READ SOURCE