సచిన్ కాదు: రోహిత్ శర్మ ఫేవరేట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. టోర్నీ అసాంతం అద్భుత ఫామ్‌లో కొనసాగిన రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ శర్మ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా ఆడిన వెస్టిండిస్, దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్‌ల్లో రోహిత్ శర్మ కేవలం ఒక హాఫ్ సెంచరీకే పరిమితమయ్యాడు. రోహిత్ శర్మ వరల్డ్‌కప్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు అతడికి విండిస్, దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్‌లలో సైతం చోటు కల్పించారు. అయితే, విండిస్ పర్యటనలో తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు.

విండిస్ పర్యటనలో

విండిస్ పర్యటనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ విఫలం కాడవంతో రోహిత్ శర్మకు సువర్ణ అవకాశం దక్కింది. అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టులో రోహిత్ శర్మను ఓపెనర్‌గా జట్టు మేనేజ్‌మెంట్ పరీక్షించబోతోంది. ఈ సిరిస్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

దీంతో ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఏ మేరకు ప్రభావం చూపుతాడనే దానిపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ఆట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైస్ కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ఐపీఎల్‌లో సైతం విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు.

నాలుగు సార్లు టైటిల్ విజేతగా

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలవడంతో రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ మొదలవుతుండటంతో రోహిత్ శర్మ తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో బయటపెట్టాడు. రోహిత్ శర్మ ఫేవరేట్ క్రికెటర్ మరెవరో కాదు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్.

మోడ్రన్ డే క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడు

దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ మోడ్రన్ డే క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడు. సుదీర్ఘ ఫార్మాటే కాదు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సైతం ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ సఫారీ దిగ్గజం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

20వేలకు పైగా పరుగులు

35 ఏళ్ల ఏబీ డివిలియర్స్ ప్రపంచ క్రికెట్‌లో 20వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడు. 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 295 టీ20ల్లో ఎనిమిది వేలకు పైగా పరుగులు చేశాడు. డివిలియర్స్ స్ట్రైక్ రేట్ 150కిపైగా ఉండటం విశేషం.

READ SOURCE