Test, ODI, T20I: తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో తొలిరోజు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఓపెనర్‌గా వచ్చి మూడు ఫార్మాట్లలో (టి20, వన్డే, టెస్టు) సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించాడు.

మొత్తంగా ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతకముందు టీ20లు, టెస్టులు, వన్డేల్లో ఓపెనర్‌గా సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్, బ్రెండన్ మెక్‌కల్లమ్, మార్టిన్ గుప్టిల్, తిలకరత్నే దిల్షాన్, అహ్మద్ షెజ్దాద్, షేన్ వాట్సన్, తమీమ్ ఇక్బాల్‌లు ఉన్నారు.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సక్సెస్

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఓపెనర్‌గా విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన రోహిత్ శర్మను తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా విశాఖ టెస్టులో జట్టు మేనేజ్‌మెంట్ పరీక్షించింది. ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ తన తొలి అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రోహిత్‌ శర్మకు ఇది నాలుగో సెంచరీ.

టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ

అంతకుముందు మిగతా మూడు సెంచరీలు మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి నమోదు చేయగా... ఈ సెంచరీని ఓపెనర్‌గా చేశాడు. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ నిలిచాడు.

300కుపైగా పరుగుల భాగస్వామ్యం

తొలి రోజు రోహిత్ శర్మ సెంచరీతో రాణించగా... రెండో రోజైన బుధవారం మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో ఓపెనర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహత్ శర్మ సెంచరీతో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డు సమం

ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును సమం చేశాడు. సొంత గడ్డపై అత్యధిక టెస్టు యావరేజిని నమోదు చేసిన ఆటగాళ్లలో బ్రాడ్‌మన్‌ సరసన చేరాడు. స్వదేశంలో రోహిత్‌ శర్మ ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 98.22 సగటుతో 884 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్‌ ఆస్ట్రేలియాలో ఆడిన 50 ఇన్నింగ్స్‌లలో 98.22 సగటుతో 4,322 పరుగులు చేశాడు.

టెస్టుల్లో నాలుగో సెంచరీ

కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడి సొంత గడ్డపై అత్యధిక యావరేజిని నమోదు చేసిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ నిలిచాడు. స్వదేశంలో ఇప్పటివరకూ 15 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌ శర్మ 98.22 టెస్టు యావరేజితో 884 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగో సెంచరీలతో పాటు ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

READ SOURCE