వైరల్‌ వీడియో.. ధోనీకి మసాజ్‌ చేసిన జీవా!!

ముంబై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మూడు నెలలకు పైగా ధోనీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఈ పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నాడు. ముఖ్యంగా ముద్దుల కుమార్తె జీవాతో సరదా సమయం గడుపుతున్నాడు. తన కూతురు చేసే అల్లరి పనులకు సంబందించిన ఫొటోలు, వీడియోలను.. ధోనీ, ఆయన సతీమణి సాక్షి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

ధోనీకి మసాజ్:

సాక్షి, ధోనీలతో పాటు జీవాకు సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా ఉంది. అమ్మ సాక్షి, నాన్న ధోనీ దీనిని నిర్వహిస్తారని 'ట్యాగ్‌లైన్‌' ఉంటుంది. తాజాగా జీవా ఇన్‌స్టాలో శనివారం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో ధోనీ సేదతీరుతుంటాడు. వెనకాల సోఫాలో కూర్చున్న జీవా.. ధోనీ భుజాలను నొక్కుతూ మసాజ్‌ చేస్తుంటుంది. ధోనీ కళ్ళు మూసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తాడు. మరో వీడియోలో ఇద్దరూ ఉయ్యాల ఊగినట్టు ఊగుతుంటారు.

జీవా ప్రేమను ఆస్వాదిస్తున్న ధోనీ:

ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొద్ది సమయంలోనే లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక అభిమానులు కూడా తమదైన స్టయిల్లో కెమెంట్లు కురిపిస్తున్నారు. 'జీవా సూపర్ జాబ్' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'జీవా చాలా క్యూట్' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. మొత్తానికి జీవా ప్రేమను ధోనీ ఆస్వాదిస్తున్నాడు.

కారును శుభ్రం చేసిన జీవా

జట్టుకి దూరంగా ఉంటున్న ధోనీ ఇటీవల కొనుగోలు చేసిన నిసాన్ జోంగాలో చక్కర్లు కొడుతున్నాడు. రాంచీ వేదికగా ఇటీవల ముగిసిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియానికి ఈ వాహనంలోనే వచ్చాడు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ధోనీ తన కారును శుభ్రం చేసుకున్నారు. అయితే ధోనీతో పాటు జీవా కూడా చేతులు కలిపింది. తండ్రీ, కూతురు ఇద్దరూ కలిసి కారును శుభ్రం చేశారు. ఆ వీడియోని ధోనీ అభిమానులతో పంచుకోగా.. అది కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

ధోనీ రీఎంట్రీ ఎప్పుడు

వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్న ధోనీని నవంబరు 3 నుంచి జరిగే బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌కు భారత సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే ధోనీనే తాను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి అందుబాటులో ఉండనని బీసీసీఐకి ముందే చెప్పాడని సమాచారం. బంగ్లాతో సిరీస్‌కే కాదు.. డిసెంబరులో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లోనూ ధోనీ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే సిరీస్‌‌లో మళ్లీ ధోనీ రీఎంట్రీ ఇచ్చే అవకాశముంది.

READ SOURCE