ఒకే ఒక్క ట్వీట్‌తో నెటిజన్‌ నోరు మూయించిన మిథాలీ రాజ్‌

హైదరాబాద్: తన భాషా ప్రాధాన్యతపై విమర్శలు చేసిన ఓ నెటిజన్‌కు టీమిండియా మహిళా వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలి రాజ్‌ గట్టి సమాధానమిచ్చి నోరు మూయించింది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌ను మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వందో వన్డే విజయాన్ని సాధించారు. వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే కెప్టెన్‌గా మిథాలీకి 100వ విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మిథాలీ రాజ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

సచిన్ ట్వీట్‌కు మిథాలీ

సచిన్ ట్వీట్‌కు మిథాలీ "చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగిన క్రికెట్‌ దిగ్గజం తనని అభినందించడం సంతోషంగా ఉంది" అని రీట్వీట్‌ చేసింది. అయితే, మిథాలీ రాజ్ ట్వీట్‌కు స్పందించిన సుగు అనే ఓ నెజిటన్ మిథాలీరాజ్‌ మాతృభాష తమిళం అయినా ఎప్పుడూ ఆ భాష మాట్లాడదని, ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ భాషల్లోనే మాట్లాడుతుందని ట్రోల్ చేశాడు.

మిథాలీకి మాతృభాష రాదని ఎద్దేవా

అంతేకాదు మిథాలీకి అసలు మాతృభాష రాదని ఎద్దేవా చేశాడు. దీంతో సుగు ట్వీట్‌కు మిథాలీ దిమ్మదిరిగిపోయే సమాధానమిచ్చింది. "నా మాతృభాష తమిళమే. నేను ఈ భాషను బాగా మాట్లాడుతా. ఒక తమిళ వ్యక్తిగా జీవించడం గర్వపడుతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవప్రద భారతీయురాలిగా ఉంటా. నా ప్రతీ పోస్టుకు స్పందించే మీ మాటలను సలహాలుగా తీసుకొని ముందుకుసాగుతా" అని మిథాలీ ట్వీట్ చేసింది.

ప్రపంచ క్రికెట్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న మిథాలీ

ఈ సందర్భంగా సుగుకు బాలీవుడ్ నటి టేలర్‌ స్విఫ్ట్‌ పాటను ఒకటి మిథాలీ షేర్ చేయడం విశేషం. ఇటీవలే మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొత్తంగా ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ కాగా, మహిళలల్లో తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఆరంభంలో మిథాళీ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

READ SOURCE